రాష్ట్రమంతా జిల్ జిల్ జిగేల్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
రాష్ట్రంలో వీధి దీపాల నిర్వహణ కోసం టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి అని సూచించారు. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని, రాష్ట్రం లోని అన్ని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేసి, ఏఐ తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి ప్రణాళికలు చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఎంపీడిఓ స్థాయి అధికారి పర్యవేక్షణ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రమంతా ఎల్ ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు.
పంచాయతీ రాజ్, మున్సిపల్, జీహెచ్ఎంసీ విభాగాలకు సంబంధించి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వీధి దీపాలకు సంబంధించి గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న LED లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసరం ఉన్నాయో పక్కాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ లెక్కించేలా సర్వే చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
రాత్రి పూట ఎల్ ఈడీ లైట్లు పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ ఈడీ డ్యాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్ కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ ఈడీ లైట్లున్నాయని, వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకే వీటిని అప్పగిస్తే.. లైట్ల నిర్వహణ, విద్యుత్తు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అలాగే రాష్ట్రంలో అన్ని ఎల్ ఈడీ లైట్లను హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5.50 లక్షల ఎల్ ఈడీ లైట్లు, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ నివేదించింది. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని చెప్పారు. కొత్తగా ఎల్ ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎల్ ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వానించాలని, ఏడేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని, నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించాలని చెప్పారు. ఎల్ ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్‌ల ఏర్పాటు, వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలన్నారు. హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ. 8 కోట్ల కరెంటు బిల్లు అవుతున్నందున, సోలార్ పవర్ వినియోగించే అంశాన్ని, అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు అనేక ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications