CM Revanth Reddy: ఇందిరా గాంధీ, వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పించిన సీఎం..
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. గురువారం ఇందిరా గాంధీ వర్ధంతి కాగా.. ఇదే రోజు వల్లభాయ్ పటేల్ జయంతి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఇందిరాగాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల వేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని రేవంత్ గుర్తు చేశారు. ఆమెను అనుసరిస్తూ పీవీ నరసింహారావు భూ సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు.
నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో కలిసి ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని మంత్రి పొన్నం గుర్తు చేశారు. అనేక సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప రాజకీయ నాయకురాలుగా ఇందిరా గాంధీ పేరు పొందారని వివరించారు. ఆమెను నేటి యువత, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఆమె పర్యటించి.. ప్రతి గ్రామంలో ఆమె తిరిగారని గుర్తు చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరొందారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలని ఉగ్రవాదుల తూటాలకి బలయ్యారని గుర్తు చేశారు. వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులున్నారు. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ అని వీహెచ్ తెలిపారు.
దేశానికి సేవ చేయడంలో భాగంగా ఉగ్రవాదుల చేతిలో చనిపోయారని గుర్తు చేశారు. దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం బీజేపీ నేతలకి గుర్తు లేదా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications