వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోందని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో "వన మహోత్సవం" కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరాలని సూచించారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు రుణాలు అందించామన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామని సీఎం చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు.. ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామన్నారు. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వనమే మనం... మనమే వనం అని పెద్దలు చెప్పారని.. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని పిలుపునిచ్చారని.. అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కను నాటాలని సూచించారు. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని.. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications