రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఆ రోజే రైతుల ఖాతాల్లోకి నిధులు!
అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తామని మిర్యాలగూడ సభలో సీఎం ప్రకటించారు. దీనికి రూ.9 వేలకోట్లు రెడీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గూడూరులో రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేసిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రజాపాలన- ప్రజా విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించారు.
గత సర్కారు సంక్షేమ పథకాలను మార్చి, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సన్నబియ్యం పొందుతున్న లబ్ధిదారులంతా కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు పథకం నిజంగా వరంగా మారిందని.. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న మహిళలు కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇతర నాయకులకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు.

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదని సీఎం రేవంత్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం డిమాండ్ ఉందని.. రాబోయే బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రజలపై కోపంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది మృతి చెందితే మామ-అల్లుళ్లు సంబరాలు చేసుకున్నారని సీఎం రేవంత్ అన్నారు. గంజి గతి లేని నాయకులు బెంజ్ కార్లు కొనుగోలు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మిగితా నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ తీరుపై ఘాటు విమర్శలు
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఘోర నేరాలు చేస్తే పోలీసులు ముసుగు తొడిగి తీసుకొస్తారు. అలాగే హరీశ్‌రావు, కేటీఆర్‌కు ముసుగు తొడిగి తేవాల్సింది. కేసీఆర్‌కు నోటీసులిస్తే తెలంగాణ జాతికిచ్చినట్లు చెప్తున్నారు' అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "జాతిపిత ఎవరు?" అన్న ప్రశ్నకు సమాధానంగా, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌నే జాతిపిత అని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అని సీఎం స్పష్టం చేశారు. రెండేళ్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు. మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఏప్రిల్‌లో ఇందిరమ్మ ఇళ్ల పండుగ
పేదల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా ఏప్రిల్‌లో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్‌లో 'ఇందిరమ్మ ఇళ్ల' నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని లక్షలాది మంది పేదలకు గూడు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications