రైతు రుణమాఫీ ప్రారంభించిన రేవంత్: హరీశ్ రావుకు చురకలు
తన జీవితంలో ఈరోజు మరిచిపోలేనిదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో తొలి విడతగా రూ. లక్ష లోపు రైతు రుణాల మాఫీని గురువారం లాంఛనంగా ప్రారంభించారు సీఎం రేవంత్. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు.
11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6098 కోట్ల నగదు జమ చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసిందన్నారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. కొంతమంది రుణమాఫీపై అపోహలు, అసత్యాలు చెబుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలా శాసనమని వ్యాఖ్యానించారు.

ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నామన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్.
సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారని రేవంత్ అన్నారు. ఎల్లుండి తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పిన రేవంత్.. వరంగల్‌లో రైతు రుణమాఫీపై చేసిన మాటను నిలబెట్టుకున్న క్రమంలో మరోసారి అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిందని.. దానికి వడ్డీగా నెలకు రూ. 7వేల కోట్లు తమ ప్రభుత్వం కడుతోందని రేవంత్ తెలిపారు. తాము రైతు రుణమాఫీ చేస్తామన్న మాట నిలబెట్టుకున్నామని.. అయితే, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామంటూ సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయమని అడగమని.. ఎందుకంటే వారు పారిపోతారని మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి రేవంత్ చురకలంటించారు.
Hon'ble CM Sri @revanth_anumula will be Launching Rythu Nestham Programme at Secretariat #TelanganaRythuBharosa https://t.co/CUG5EQOWv6
— Telangana CMO (@TelanganaCMO) July 18, 2024
రైతు రుణమాఫీ నిధులు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications