కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ, రేపు ఖర్గే, రాహుల్‌తో, కేబినెట్ విస్తరణపై చర్చ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ పెద్దలకు వివరించినట్లు తెలిపారు.

కులగణన సర్వేను రాహుల్ గాంధీకి అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో భారీ బహరింగ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా, ఢిల్లీ పెద్దల పిలుపుతో సీఎం రేవంత్ తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గురువారం సాయంత్రం ఢిల్లీకి పయనమైన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సామాజిక సమీకరణల ఆధారంగా ఆయా జిల్లాల్లో ఆశావాహుల జాబితాను దీపాదాస్ మున్షీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications