కేంద్రానికి రేవంత్ కీలక డిమాండ్..
Revanth Reddy: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. రిజర్వాయర్లు వరద నీటితో పోటెత్తుతున్నాయి. కొత్త నీటితో జలకళను సంతరించుకున్నాయి. దాదాపుగా అన్ని జలాశయాల గేట్లను ఎత్తివేశారు. అదనపు జలాలను దిగువకు వదిలివేస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు.. ఇలా ఒక్కటని కాదు- జల వనరులన్నీ నిండుకుండలా మారాయి.
వ్యవసాయానికి మరో ఏడాది పాటు ఎటువంటి నీటి కొరత గానీ, ఇబ్బందులు గానీ ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. సకాలంలో అన్నదాతలకు ఆపన్నహస్తం అందించగలిగితే పంట దిగుబడి అంచనాలకు మించి ఉంటుందనీ చెబుతోంది. రైతులకు ఏ ఇబ్బంది రాకుండా, ఏ లోటూ లేకుండా చర్యలు తీసుకుంటోంది.

ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ముందు ఓ డిమాండ్ పెట్టారు. రాష్ట్ర రైతుల యూరియా కొరత తీర్చేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి మంజూరైన కోటా ప్రకారం యూరియాను వెంటనే సరఫరా చేయాలని అన్నారు.
తెలంగాణకు యూరియా సరఫరాలో జాప్యం, కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రానికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఇప్పటికే కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారని రేవంత్ రెడ్డి తెలిపారు. మంజూరైన కేటాయింపులు ఉన్నప్పటికీ, రాష్ట్రానికి తగినంత యూరియా అందడం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణకు 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించగా, ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల కొరత వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర ఎంపీలు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఇప్పటికే ఒక వినతిపత్రాన్ని సమర్పించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశంపై తాను వ్యక్తిగతంగా కేంద్ర మంత్రులతో మాట్లాడానని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్రానికి అనేకసార్లు లేఖలు రాశారని ఆయన తెలిపారు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియాను సరఫరా చేయకుండా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ, రైతుల తరపున నిరసనలు తెలిపినప్పటికీ, సరఫరా ఇంకా మంజూరైన కోటాతో సరిపోలడం లేదని ఆయన విమర్శించారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, మంజూరైన కేటాయింపులకు అనుగుణంగా యూరియాను వెంటనే పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications