హైదరాబాద్ నడిబొడ్డున స్టీల్ బ్రిడ్జి నేడే ప్రారంభం- ఈ రూట్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..!!
హైదరాబాద్ వాసులకు కీలక అప్డేట్. నగరం నడిబొడ్డున కొత్త స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తోంది. ఈ రోజు నుంచి వాహనదారులను అనుమతించనున్నారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే విధంగా ప్రధాన మార్గంలో ఈ బ్రిడ్జిని రూ 620 కోట్లతో నిర్మించారు. నాలుగు లేన్ల ఈ స్టీల్ బ్రిడ్జి ద్వారా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి లో కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.
హైదరాబాద్ నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్‌నగర్ పరిధిలోని యాదగిరి థియేటర్ వరకు నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి ని గురువారం ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించ నున్నారు. దాదాపు రూ.620 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సైదాబాద్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్, నల్గొండ ఎక్స్‌రోడ్ పరిసరాల్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు కొంతమేర ఉపశమనం లభించనుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ స్టీల్ బ్రిడ్జి సుమారు 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. నాలుగు లేన్లుగా నిర్మించిన ఈ వంతెన చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ మీదుగా సంతోష్‌నగర్ వైపు రాకపోకలను సులభతరం చేయనుంది.

ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సమయం ఆదా
కాగా.. నిర్మాణ పనులు వివిధ కారణాలతో ఆలస్యమైనప్పటికీ.. పనులు పూర్తిచేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సైదాబాద్ జంక్షన్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో రద్దీ కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా చార్మినార్, పాతబస్తీ వైపు నుంచి సంతోష్‌నగర్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లే వాహనాలు తరచూ ట్రాఫిక్‌లో చిక్కుకుంటాయి. ఈ నేపథ్యంలో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. వాహనదారుల రాకపోకలకు అనుగుణంగా వంతెనకు అవసరమైన ర్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ఐఎస్ సదన్ వైపు నుంచి నల్గొండ ఎక్స్‌రోడ్ దిశగా వెళ్లే వాహనాలకు అప్ ర్యాంప్, మరోవైపు వెళ్లే వాహనాలకు డౌన్ ర్యాంప్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications