కొత్త రేషన్ కార్డులు, రూ 500కే వంటగ్యాస్ - అమలుపై రేవంత్ కీలక నిర్ణయం..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం..తాజాగా మరో రెండు ప్రారంభం పైన నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు, రూ 500కే వంట గ్యాస్ అమలు పై ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
హామీల అమలు కోసం : తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోనియా గాంధీ జన్మదినం నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..రూ 10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన పథకాల అమలు దిశగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రజాపాలన పేరుతో డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అయిదు హామీలకు సంబంధించి 1,05,91,636 అర్జీలు రాగా.. ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. వీటిలో అధికంగా నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

కొత్త రేషన్ కార్డులు : ఈ రోజు ముఖ్యమంత్రి ఈ దరఖాస్తులు..తదుపరి అడుగుల పైన మంత్రులు..ఉన్నతాధికారులతో సమీక్ష ఏర్పాటు చేసారు. దాదాపు 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసారు. డూప్లికేట్ కార్డులను తొలిగించి..అర్హత ఉన్నవారికి కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ప్రతీ ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి..క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. గ్యారంటీల అమలుకు రేషన్ కార్డు కీలకం కావటంతో..ఈ కార్డుల మంజూరులోనూ ఎక్కడా లోపాలు లేకుండా కొత్తవి మంజరు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఈ రోజు దీనికి సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

రూ 500కే వంట గ్యాస్ : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని ఆరు హామీల్లో పేర్కొంది. సిలిండర్ ధర రూ.955 ఉండగా.. ప్రభుత్వం రూ.455 సబ్సిడీ భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) 89.99 లక్షల మంది ఉన్నారు. వీరికి ఏడాదికి 6 సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై రూ.2,225 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. 12 సిలిండర్లు ఇస్తే అది రూ.4,450 కోట్లవుతుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.40 సబ్సిడీ ఇస్తోంది. మొత్తం డబ్బు చెల్లించి తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ రెండు పథకాల అమలు పైన ప్రభుత్వం అధికారికంగా విధి విధానాల పై ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications