తెలంగాణ పునరేకీకరణ: 33 జిల్లాల అవసరమే లేదు: అసెంబ్లీలో బిల్లు: రేవంత్ సంచలనం
Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తోన్నారు. మెరికల్లాంటి బ్యురోక్రాట్లను కీలక స్థానాల్లో నియమిస్తోన్నారు.
శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న తప్పులను సరిదిద్దుతున్నారు.
ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పునరేకీకరణ ప్రయత్నాలకు పూనుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నింటినీ కూడా పునరేకీకరించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగనున్నట్లు సమాచారం.

తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. గతంలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా.. విభజన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని విభజించారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారాయన. ఫలితంగా వాటి సంఖ్య 10 నుంచి 33కు పెరిగిన విషయం తెలిసిందే.
వాటన్నింటినీ ఏకీకరించడంపై దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 33 జిల్లాల అవసరం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. చిన్న జిల్లాలన్నింటినీ పునరేకీకరించాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం.
జిల్లాల సంఖ్యను కుదించేలా ఈ కార్యాచరణ ప్రణాళిక ఉండబోతోందని అంటున్నారు. వాటి సంఖ్యను ఎంతవరకు కుదిస్తామనేది ఇంకా ఖరారు కాలేదు. దీని కోసం జిల్లాల రీఆర్గనైజేషన్ కోసం త్వరలోనే ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దీనిపై సభలో బిల్లును ప్రవేశ పెడతామని అన్నారు.












Click it and Unblock the Notifications