భవిష్యత్ తరాలపై పెట్టుబడి.. సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్ కి ఇదే నిదర్శనం!
గురుకులాలలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో గురుకులాలలో కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించి వారి భవిష్యత్తు ప్రణాళికలను లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుకు కృషి
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారని నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ ఎక్కువ అని, ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు టాలెంట్ తక్కువనే అపోహ ఉండేదని అలాంటి అపోహలను తొలగించాలని ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

విద్యా ప్రమాణాలు పెంచాలని దృఢ సంకల్పం
రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకున్న వారు ఎంతోమంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లుగా ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. విద్యావ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి విద్యా ప్రమాణాలు పెంచాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డైట్ చార్జీలు 40%, కాస్మెటిక్ చార్జీలు 200 శాతం పెంచామన్నారు.
సింగిల్ స్ట్రోక్ లో డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపు నిర్ణయం
ఇది ప్రజా ప్రభుత్వం నిరూపించడం కోసమే సింగిల్ స్ట్రోక్ లో నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలోనే ఒకేసారి ఇంత మొత్తం ఎక్కడా పెంచలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వారందరికీ మంచి విద్యాబోధన చేస్తున్నామన్నారు. ఈ మధ్య ఫుడ్ పాయిజన్ జరిగి ఒక బాలిక మరణించింది అని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
విద్యార్థులు మన రాష్ట్ర సంపద
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడలలో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని, విద్యార్థుల్లో ఉన్న ఇతర టాలెంట్లను కూడా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు మన రాష్ట్ర సంపదని, వారి కోసం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కాదు భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications