సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. తమ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది.రాజీవ్ జయంతి వేళ ఆయన విగ్రహం ఏర్పాటు గురించి మాట్లాడే సందర్భంలో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సమయంలో ఆయన బీఆర్ఎస్ నేతలను పరుష పదజాలంతో దూషించారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని వ్యాఖ్యానించారు. రాజీవ్ విగ్రహం ఎప్పుడు ముడతారో చెబితే జగ్గన్నను పంపిస్తామని హెచ్చరించారు.
ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండని రేవంత్ సవాల్ చేసారు. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదని పేర్కొన్నారు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పారు. రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారని మండిపడ్డారు. వారి బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారన్నారు.

వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నారన్నారు. వాళ్ల అయ్య పోయేదెప్పుడు.. విగ్రహాన్ని పెట్టేదెప్పుడని రేవంత్ వ్యాఖ్యానించారు.పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తమ నాయకుడుపై తప్పుడు, పరువు నష్టం కలిగించే విధంగా మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి హద్దులు దాటి మాట్లాడారని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి విద్యార్థులు, ఇతర ప్రముఖులు ఉన్న సమావేశంలో రాజకీయాలు గురించి మాట్లాడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. బతికుండగానే కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించారంటూ నిరాధారమైన ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ అమర్యాదగా మాట్లాడి, అశాంతిని రెచ్చగొట్టేలా పరుష పదజాలంతో దూషించారని రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ కీలక నేత దాసోజు శ్రవణ్ మొదలగు బీఆర్ఎస్ నేతలు స్వయంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications