మంత్రి పద్మారావు కుమారుడి దౌర్జన్యం: పచ్చళ్ల వ్యాపారి కుటుంబంపై దాడి
రామేశ్వర్ గౌడ్ దౌర్జన్యంపై మోహిత్ స్థానిక మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వీళ్లు చెబితే కేసు నమోదు చేస్తారా? అంటూ కానిస్టేబుల్ పై జులుం ప్రదర్శించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యుల మీద, కానిస్టేబుల్స్ మీద జులుం ప్రదర్శించారని మంత్రి పద్మారావు గౌడ్ కుమారుడు రామేశ్వర్ గౌడ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ పచ్చళ్ల వ్యాపారి కుటుంబాన్ని నలుగురి ముందు అసభ్య పదజాలంతో దూషించి.. వారిపై దాడి చేసినట్టుగా రామేశ్వర్ గౌడ్ పై డీసీపీకి ఫిర్యాదు అందింది.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో మోహిత్ రాథోడ్ కుటుంబం 50ఏళ్లుగా పచ్చళ్ల వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగిస్తోంది. అయితే ఇటీవలే ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో భాగంగా అధికారులు మోహిత్ దుకాణం ముందున్న అరుగులను తొలగించేశారు. కేవలం తమ ఇంటి అరుగులనే తొలగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన మోహిత్ కుటుంబం.. ఇతరుల ఆక్రమణలను కూడా తొలగించాలని డిమాండ్ చేసింది.
దీంతో మోహిత్ ఇంటి పక్కనే ఉన్న సాయిబాబా దుకాణాన్ని అధికారులు కొంతమేర తొలగించారు. అధికారుల తీరుపై ఆగ్రహం చెందిన సాయిబాబా మంత్రి పద్మారావు కుమారుడికి ఫోన్ ద్వారా విషయం చేరవేశాడు. సమాచారం అందుకున్న రామేశ్వర్ గౌడ్ 20మంది స్నేహితులను వెంటేసుకుని వచ్చి మోహిత్ కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

అధికారుల ముందే మోహిత్ కుటుంబాన్ని దూషించడమే గాక వారిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. మోహిత్ పై రామేశ్వర్ గౌడ్ పిడిగుద్దులతో విరుచుకుపడగా.. అడ్డుకోబోయిన మోహిత్ తండ్రి రాజేష్. తల్లి ఛాయా, బంధువు సత్యనారాయణలపై కూడా రామేశ్వర్ గౌడ్ దాడి చేసినట్టుగా చెబుతున్నారు.
రామేశ్వర్ గౌడ్ దౌర్జన్యంపై మోహిత్ స్థానిక మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వీళ్లు చెబితే కేసు నమోదు చేస్తారా? అంటూ కానిస్టేబుల్ పై జులుం ప్రదర్శించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రామేశ్వర్ గౌడ్ దౌర్జన్యంపై మోహిత్ కుటుంబం డీసీపీని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది.
అయితే మోహిత్ కుటుంబం డీసీపీని ఆశ్రయించడంతో రామేశ్వర్ గౌడ్ వారిని చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆ కుటుంబం వాపోతుంది. కేసు ఉపసంహరించుకోకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానంటూ తనను బెదిరిస్తున్నాడని మోహిత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణం పోయినా కేసు వెనక్కి తీసుకోబోమని, మంత్రి కుమారుడి దౌర్జన్యాలతో స్థానిక ప్రజలు వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవతున్నారని అన్నారు. పోలీసులు సైతం రామేశ్వర్ గౌడ్ ప్రవర్తనను పట్టి లేనట్టుగా వదిలేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఫిర్యాదుపై డీసీపీ సుమతి స్పందించారు. మంత్రి పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ దాడికి సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలున్నాయని, వాటి ఆధారంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications