'డ్రైవర్ అలా చేయకపోయుంటే మరిన్ని ప్రాణాలు పోయేవి'.. కండక్టర్ ఏం చెప్పారంటే..?
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఓవర్ స్పీడుతో వస్తున్న కంకర లారీ ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న కంకర పడడంతో బస్సులోనే ప్రయాణికులు కూరుకుపోయి ప్రాణాలు వదిలారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు.
అయితే ఈ ఘటనపై కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
కంకర ఓవర్ లోడ్ తో పాటు రాంగ్ రూట్ లో రావడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా సమయంలో టిప్పర్ లోనే యజమాని లక్ష్మణ్ ఉన్నాడు. లడారం- శంకరపల్లి వరకు టిప్పర్ ను లక్ష్మణ్ డ్రైవ్ చేశాడు. ఆ తర్వాత శంకర్ పల్లి నుంచి మరో డ్రైవర్ ఆకాశ్ టిప్పర్ నడిపాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఆకాశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన లక్ష్మణ్ ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఇక బస్సు కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు ప్రమాద దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన బస్సు కండక్టర్ రాధ ఎమోషనల్ అయ్యారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
" బస్సు ప్రమాదం అంతా మా కళ్లముందే క్షణాల్లోనే జరిగిపోయింది. టిప్పర్ చాలా వేగంగా వస్తున్నట్లు నేను, మా డ్రైవర్ దస్తగిరి గుర్తించాము. వెంటనే డ్రైవర్ దస్తగిరి బస్సును కిందకు తిప్పే ప్రయత్నం చేశాడు. అలా చేయకపోయింటే ఇంకా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయేవారు. ఒక్క క్షణంలోనే అంతా మారిపోయింది. డ్రైవర్ వెనుక సీట్లో కూర్చొన్నవారిపై చాలా కంకర రాళ్లు పడ్డాయి. ఓ వ్యక్తి నన్ను కాపాడాడు. తల నుంచి రక్తం కారుతున్న క్రమంలో నా చున్నీతో నేను కట్టుకున్నాను" అని ఆమె వివరించారు.

మరోవైపు చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఘటనలో మృతిచెందిన టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి స్వస్థలం నాందేడ్ కు అంబులెన్స్ లో తరలించారు. టిప్పర్ డ్రైవర్ మద్యం తాగలేదని ఫోరెన్సిక్ వైద్యులు ధ్రువీకరించారు.












Click it and Unblock the Notifications