
కుటుంబంలో కలహాలు సహజం.!జగ్గారెడ్డి అంశం కూడా అంతే.!అన్నీ సర్ధుకుంటాయన్న రేవంత్ రెడ్డి.
ములుగు/హైదరాబాద్ : సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు స్వేచ్చ ఎక్కువని, వారి మనోభావాల ప్రకారం పార్టీ మూల సిద్దాంతాలకు విఘాతం కలగకుండా ప్రకటనలు చేసుకుంటారని అన్నారు. మేడారంలో సమ్మక్క సారాలమ్మ దేవతలను దర్శనం చేసుకున్న రేవంత్ రెడ్డి అక్కడే మేడారంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారన్న విషయంపై రేవంత్ రెడ్డి స్పందించారు.

కుటుంబంలో కలహాలు సహజం.. కాంగ్రెస్ లో కూడా అంతేనన్న రేవంత్ రెడ్డి
జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాన్ లాంటిదనన్నారు రేవంత్ రెడ్డి. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉండడం సహజం అన్నారు. కాంగ్రెస్ భిన్నత్వంలో ఏకత్వంగల పార్టీ అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం ఉంటుందని, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందన్నారు రేవంత్ రేవంత్ రెడ్డి. అన్ని పరిస్థితులు సర్థుకుంటాయని, వివాదాలు అన్నీ తొలగిపోతాయని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంశంలో ఇదే జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

సమ్మక్క సారలమ్మల పోరాటమే తమకు స్ఫూర్తి..తెలంగాణ ఉద్యమానికి కూడా ప్రేరణ అన్న పీసిసి ఛీఫ్
ఇదిలా ఉండగా తాను పోలీసులపై మాట్లాడిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. కానీ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. సమ్మక్క సారలమ్మల పోరాటమే తమకు స్ఫూర్తి అని, తెలంగాణ ఉద్యమానికి కూడా సమ్మక్క-సారలమ్మలే ప్రేరణ అన్నారు రేవంత్. మేడారం మహాజాతరకు ప్రపంచ గుర్తింపు రావాల్సి ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసారు రేవంత్ రెడ్డి.

ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరు పెట్టాలి.. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుందన్న రేవంత్
అంతే కాకుండా ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరు పెట్టాలని, చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మేడారం జాతరను విస్మరించిందని విమర్శించారు. సమ్మక్క పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని కించపరిచారని, సమ్మక్క చరిత్రను కనుమరుగు చేయడానికి చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు. చిన్నజీయర్ స్వామి, రామేశ్వరరావు నిర్మించిన ఆలయాలకు ఇచ్చిన విలువ, సమ్మక్క జాతరకు ఇవ్వలేదని అన్నారు. కృత్రిమమైన కట్టడం దగ్గర పొర్లు దండాలు పెట్టిన చంద్రశేఖర్ రావు కుటుంబం, మేడారం జాతరకు ఎందుకు రాలేదని నిలదీసారు. ముచ్చింతల్ కు వచ్చిన ప్రధాని మోదీ మేడారం ఎందుకు రాలేదని, సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు.

మేడారం మహా జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి..ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని పీసిసి ఛీఫ్
మేడారం మహా జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని పీసిసి ఛీఫ్ డిమాండ్ చేసారు. ప్రతీ మేడారం మహా జాతరకు 500 కోట్లు కేటాయించాలని, పేదల విశ్వాసాల పట్ల చంద్రశేఖర్ రావు కుటుంబానికి నమ్మకం లేదని, తెలంగాణలో జిల్లాలను కుక్కలు చింపిన విస్తరిగా మార్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరుపెడతామన్నారు రేవంత్ రెడ్డి. సీతక్క సంతకంతోనే ములుగు జిల్లాను తీసుకువస్తామన్నారు. 12 నెలల తర్వాత తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తుందని, ఆ రాజ్యంలో సీతక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.