ఓటేసిన కవితపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు.. వివాదంలో కేసీఆర్ తనయ!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ నాడు ఎమ్మెల్సీ కవిత తీరు వివాదాస్పదంగా మారింది. ఈరోజు ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్న కవిత చేసిన వ్యాఖ్యలు ఆమెను వివాదంలోకి లాగాయి. కవిత చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో డి ఏవి స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం ఎంఎల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసింది.

కవిత పై చర్యలు తీసుకోవాలని, ఆమె ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ సిఈసి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేయగా, కవిత చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఈసికి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అసలు కవిత ఏం మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ ఏం ఫిర్యాదు చేసిందో తనకు తెలియదని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే ఈరోజు తెల్లవారుజామున ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత తాను బంజారాహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్నాను అని, పట్టణాల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి యువత ఓటు చాలా అవసరమని పేర్కొన్న ఆమె, యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఎన్నికలలో మహిళలు ఎక్కువ శాతం ప్రభావం చూపుతారని పేర్కొన్న కవిత, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీకే పోతారని, ఇక్కడ గెలిచేది తామేనని స్పష్టం చేశారు. కెసిఆర్ అభివృద్ధి చూడండి అంటూ ఎమ్మెల్సీ కవిత ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలు ఆమెను వివాదంలోకి లాగాయి.












Click it and Unblock the Notifications