ఉత్తమ్‌కు కీలక బాధ్యతల అప్పగింత
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. దీనితో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తరువాతే.. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా పడొచ్చా? లేక షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయా? అనేది తేలుతుంది. అప్పటివరకు తెలంగాణలో ఎవరి రాజకీయ కార్యకలాపాల్లో వారు మునిగిపోయారు.

యధాతథంగా షెడ్యూల్ ప్రకారమే ఈ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితే తలెత్తితే మాత్రం అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్‌లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికోసం అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసింది. ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకుంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల స్థితిగతులు, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచారం, బహిరంగ సభలు, రోడ్ షో..వంటి అంశాలను ఈ కమిటీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 16 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ..లకు ఇందులో చోటు దక్కింది.
Congress President Shri @kharge has constituted the Central Election Committee. The list is as follows- pic.twitter.com/jfdcR8KSEN
— Congress (@INCIndia) September 4, 2023
తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్ నేత, నల్గొండ లోక్‌సభ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ కమిటీలోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్, కర్ణాటక మంత్రి కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహ్మద్ జావెద్, అమీ యజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మర్కమ్, కేసీ వేణుగోపాల్ ఈ కమిటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications