
మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్: కమిటీ ప్రకటన; సోదరుడి దెబ్బకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ షాక్!!
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టు ఉండడంతో ఆయన రాజీనామా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించినా, గత కొంతకాలంగా నాన్చుడు ధోరణి కాంగ్రెస్ పార్టీని సంకటంలోకి నెట్టింది. ఎట్టకేలకు మునుగోడు పంచాయితీకి తెర పడడంతో దిద్దుబాటు చర్యలలో కాంగ్రెస్ పార్టీ మునుగోడుపై దృష్టి సారించింది.

కోమటిరెడ్డి బ్రదర్ రాజీనామాతో మునుగోడుపై అన్ని పార్టీల ఫోకస్
ఇక మునుగోడులో ఉప ఎన్నిక ఖాయం కావడంతో ఈసారి ఉప ఎన్నికల్లో మునుగోడులో గులాబీ జెండా ఎగురవేయాలని టిఆర్ఎస్ పార్టీ, రాజగోపాల్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకుంటే కాషాయ జెండా మునుగోడులో ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయినా పార్టీని కాపాడుకోవాలని, మళ్లీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దీంతో మునుగోడులో ఉప ఎన్నికల హడావిడి కొనసాగనుంది. దీనిపై స్థానికంగానూ ఆసక్తికర చర్చ జరుగుతుంది.

నష్ట నివారణా చర్యలను మొదలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధినాయకత్వం రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే మునుగోడులో జరుగనున్న ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ కమిటీని ప్రకటించింది. నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తున్న సమయంలోనే ఆ పార్టీ ఉప ఎన్నికల కమిటీని ప్రకటించడం గమనార్హం.

మునుగోడు ఉప ఎన్నికకు స్ట్రాటజీ మరియు ప్రచార కమిటీ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్
మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి స్ట్రాటజీ మరియు ప్రచార కమిటీ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ను కన్వీనర్ గా నియమించింది. కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అనిల్ కుమార్ లను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ కమిటీలో చోటు కల్పించలేదు.

మునుగోడు కాంగ్రెస్ లో కీలక నాయకులపై పట్టు తగ్గకుండా ప్లాన్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి ఎంపీ స్థానం పరిధిలోకి మునుగోడు నియోజకవర్గం కూడా వచ్చినప్పటికీ ఆయనకు స్థానం కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణిక్కం ఠాకూర్ ఈ జాబితాను ప్రకటించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీలో ద్వితీయ శ్రేణిలో ఉన్న బలమైన నాయకులను పార్టీ నుండి బయటకు వెళ్లకుండా మంతనాలు జరుపుతోంది. ఇక తాజాగా కమిటీని ప్రకటించి మునుగోడు పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సోదరుడి రాజీనామా నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పరపతి తగ్గినట్టు తాజా పరిణామాలతో అర్థమవుతుంది.