కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ''ప్లాన్ B'' అమలు చేయబోతున్న కాంగ్రెస్?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీని వీడకుండా ఉండేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ తదితరులు సంప్రదింపులు జరిపారు. అయితే తాజాగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కోమటిరెడ్డి విషయంలో 'ప్లాన్ A' విఫలమైతే 'ప్లాన్ B' అమలు చేస్తామని ప్రకటించారు.
కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి విధేయుడని, ఆయన పార్టీని వీడకుండా ఉండేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. రాజగోపాల్ కు తలెత్తిన ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. కోమటిరెడ్డి బయటకు వెళ్లకుండా చూడటమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. పార్టీ నేతలు చేస్తున్న సంప్రదింపులు సఫలీకృతం కాకపోతే పరిష్కారం ఏమిటన్న ప్రశ్నకు భట్టి 'ప్లాన్ B' అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఢిల్లీకి రావాలని, సమస్య ఉంటే పరిష్కరించుకుందామంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, పూర్తయిన వెంటనే ఢిల్లీకి వస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. 15 రోజుల్లో కేసీఆర్ పై యుద్ధం ప్రకటిస్తామని, మునుగోడు నుంచి వచ్చే మార్పు తెలంగాణ మార్పునకు కారణమవుతుందని రాజగోపాల్ ప్రకటించారు. కేసీఆర్ అనుకుంటే ఉప ఎన్నిక రాదని, ప్రజలు అనుకుంటే వస్తుందన్నారు. ఇది ఇరుపార్టీల మధ్య జరిగే యుద్ధం కాదని, కేసీఆర్‌కు, ప్రజలకు మధ్య జరిగే యుద్ధమన్నారు. అమిత్ షాతో తన రాజీనామా గురించి మాట్లాడలేదని వెల్లడించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications