టీ -పీసీసీ నూతన చీఫ్ గా రేవంత్..! ఉత్తమ్ సెల్ఫ్ గోల్: నేత‌ల ఢిల్లీ బాట‌..ఎవ‌రిదారి వారిదే.. !

Recommended Video

    Revanth Reddy Will Appoint As TPCC Chief ? || టీ -పీసీసీ నూతన చీఫ్ గా రేవంత్ రెడ్డి..!

    తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారధి రాబోతున్నారా. హుజూర్ నగర్ ఫలితం వరకు ఎదురు చూసిన కాంగ్రెస్ ఆశావాహులు ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఇక, ఇదే ఉప ఎన్నిక ఫలితం ప్రస్తుత పీసీసీ చీఫ్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదన మొదలైంది, ఆయనను పీసీసీ బాధ్యతల నుండి తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..కొంత కాలంగా ఈ పదవి ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలతో పాటుగా ఇతర నేతలు తమ వంతు లాబీయింగ్ మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు హస్తిన బాట పట్టారు. అయితే, హర్యానా రాజకీయాల్లో బిజీగా ఉన్నా కాంగ్రెస్ హైకమాండ్.. త్వరలోనే తెలంగాణ పీసీపీ చీఫ్ గా ఉత్తమ్ ను కొనసాగించటమా..లేక కొత్త వారికి అప్పగించటమా అనే అంశం పైన నిర్ణయం తీసుకోనుంది. అయితే, రేసులో రేవంత్ తో పాటుగా కోమటిరెడ్డి ప్రధానంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఉత్తమ్ సెల్ఫ్ గోల్..

    ఉత్తమ్ సెల్ఫ్ గోల్..

    హుజూర్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ ఘోర ప‌రాభ‌వం ఇప్పుడు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కు కొత్త సమస్యలకు కారణమవుతోంది. గతంలోనే పీసీసీ చీఫ్ మార్పు పైన చర్చ సాగినా.. ఉప ఎన్నిక తరువాత నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇప్ప‌టికే పీసీసీ మార్పు అంశంపై పార్టీలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. హూజూర్‌న‌గ‌ర్ ఓట‌మితో పీసీసీ మార్పు త‌ప్ప‌నిస‌రి అంటూ కాంగ్రెస్ మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. హూజ‌ర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత‌లంతా క‌లిసి ఉన్న‌ట్లు ఎవరికి వారు తమ రాజకీయం చేసారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉత్తమ్ ను ఓటమికి బాధ్యుడిని చేసే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిని మార్చకపోతే..ఇక పార్టీకి భవిష్యత్ ఉండదంటూ కొందరు నేతలు అధినేత్రికి నివేదికలు సైతం పంపిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

    తప్పుకొనేందుకు ఆయన సిద్దం..

    తప్పుకొనేందుకు ఆయన సిద్దం..

    ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా అధిష్టానానికి హూజూర్‌న‌గ‌ర్ గెలిపించుకుంటాన‌నే భ‌రోసా ఇచ్చి నల్గొండ ఎంపీగా బరిలో దిగి విజ‌యం సాధించారు. ఎంపీగా ఉత్త‌మ్ గెలిచినా.. ఎమ్మెల్యే స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయారు. దీన్ని కాంగ్రెస్ హైక‌మాండ్ సీరియ‌స్‌గా తీసుకునే అవ‌కాశ‌ముంది. హూజ‌ర్‌న‌గ‌ర్ ఓట‌మితో ఉత్త‌మ్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నార‌ని కాంగ్రెస్‌లోని మ‌రోవ‌ర్గం ప్ర‌చారం చేస్తున్నారు.
    మొన్న జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు ప‌ట్ల‌ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ లో చాలా మంది ఆగ్ర‌హంతో ఉన్నారు. రాజ‌కీయ భ‌విష్య‌త్ ను కూడా దెబ్బ‌కొట్టార‌ని ప‌లువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీప్ ప‌గ్గాల‌పై ఆశ‌లుపెట్టుకున్న నేత‌లే.. ఉత్త‌మ్ కొంప‌ముంచార‌నే ప్ర‌చారముంది. పీసీసీ చీఫ్ ఉండి ఎమ్మెల్యేల వ‌ల‌స‌ల‌ను ఆప‌లేక‌పోయార‌ని కాంగ్రెస్ స‌భాప‌క్ష నేత బ‌ట్టి విక్ర‌మార్క కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో..ఉత్తమ్ సైతం అధిష్ఠానం ముందు తాను పీసీసీ చీఫ్ గా తప్పుకొనేందుకు సిద్దమని చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

    రేవంత్ కు తొలి ప్రాధాన్యత..

    రేవంత్ కు తొలి ప్రాధాన్యత..

    అంచనా వేస్తున్నట్లుగా ఉత్తమ్ ను పీసీసీ బాధ్యతల నుండి తప్పిస్తే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనే అంశం ఆసక్తి కరంగా మారుతోంది. ఇక కొత్త‌గా చేరిన రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పీసీసీ ప‌గ్గాలు అందిస్తారోన‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఇక న‌ల్గొండ‌లో బ‌ల‌మైన నేతగా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అధిష్టానం మెప్పు కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ద‌ళిత కోటాలో ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్‌, బీసీ కోటాలో పొన్నం ప్ర‌భాక‌ర్‌లు పీసీసీ ప‌గ్గాల కోసం పోటీప‌డుతున్నారు. ఇక సీనియ‌ర్ నేత ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌బాబు పీసీసీ ప‌గ్గాల కోసం నేను సైతం అంటున్నారు. టీఆర్ఎస్ బల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగిన నేప‌థ్యంలో అందుకు త‌గ్గ‌రీతిలో పార్టీని న‌డిపే నాయ‌కుడి కోసం కాంగ్రెస్ హైక‌మాండ్ అన్వేషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే దూకుడుగా వ్యవహరించగలిగిన రేవంత్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+