పార్టీ మారిన కీలక నేతలు: బీఆర్ఎస్‌లోకి గద్వాల డీసీసీ చీఫ్ పటేల్, కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు మంత్రి హరీశ్.
ఆయనతోపాటు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ ఉమాదేవి, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని.. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందన్న విశ్వాసంతోనే తాను పార్టీలో చేరినట్లు ప్రభాకర్ రెడ్డి, నేతలు తెలిపారు. గద్వాల్‌లో కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రతాప సింగారంలోని సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి, ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆయనను మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు.
బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతూ తనను ఎంపీగా గెలిపించారని అన్నారు రేవంత్. ఇక్కడి ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డు నుంచి విముక్తి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సుధీర్ రెడ్డికి రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు రేవంత్. ఎన్నికల్లో టికెట్ రానివారి ఆవేదనను తాను అర్థం చేసుకుంటానని, తమకు ద్వేషం లేదని, అందరినీ కలుపుకుని పనిచేస్తామన్నారు. ముందున్న లక్ష్యాన్ని చూస్తూ పనిచేయాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలను ఆయన కోరారు.












Click it and Unblock the Notifications