కేసీఆర్‌కు రాజకీయ భిక్షపెట్టిన పార్టీదే ఖమ్మం అంటూ రేణుకా చౌదరి
ఖమ్మం: బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి. ఖమ్మం డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట అంటూ రేణుకా చౌదరి
పేర్లు, రంగులు మార్చినంత మాత్రాన ప్రజలు నాయకులను నమ్మరని పరోక్షంగా బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో నాలుగు లక్షలకుపైగా ఓట్లు సాధించామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో గెలిచి తీరుతామని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సేనంటూ రేణుకా చౌదరి
కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకులపై నిర్బంధాలు ఇక చెల్లవన్నారు రేణుకా చౌదరి. రానున్న కాలంలో కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం ఖాయమని అన్నారు. హిందుత్వ ముసుగులో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని రేణుకా చౌదరి ఆరోపించారు.

ఖమ్మంతో విడదీయరాని అనుబంధమంటూ రేణుకా చౌదరి
ఖమ్మం జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఇక్కడే ఉంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. కేంద్రమంత్రిగా పాలేరు నుంచి పర్ణశాల వరకు అభివృద్ధి చేశానని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు దేశంలోని అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అంతకుముందు ఖమ్మంలోని మమతా రోడ్డులో తన నూతన క్యాంపు కార్యాలయాన్ని రేణుకా చౌదరి ప్రారంభించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, టీపీసీసీ అధికార ప్రతినిధి మజ్జి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మానుకొండ రాధా కిషోర్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications