కేసీఆర్ స్కెచ్: ఫామ్‌హౌస్ కోసమే ఆ ప్రాజెక్ట్: బట్టబయలు చేసిన కోమటిరెడ్డి: ప్రశాంత్ కిశోర్ పేరు
హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తాను మర్యాదపూరకంగానే కలిశానని, ఇందులో రాజకీయాలకు అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను అమిత్ షాను కలిస్తే కేసీఆర్‌కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందనే దుష్ప్రచారం చేస్తోన్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో ఎదురైన ఓటమిని మునుగోడులో గెలిచి మర్చిపోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోందని చురకలు అంటించారు.

ఆ దుష్ప్రచారం..
కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందనే విషయం ప్రశాంత్ కిషోర్ సర్వేలోనే స్పష్టమైందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇకపై గెలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తాను బీజేపీలోకి వెళ్తోన్నాననే దుష్ప్రచారానికి తెర తీశారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం నష్టాల్లోకి దిగజార్చిందని, నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని అన్నారు.

జీతాలివ్వని దుస్థితి..
సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి తెలంగాణలో ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? లేదా? అనేది తన నియోజకవర్గ ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సొంతంగా ఏ నిర్ణయాన్నీ తీసుకోలేనని తేల్చి చెప్పారు. మునుగోడులో ఉప ఎన్నిక కోసం కేసీఆర్ రంకెలు వేస్తోన్నారని, ఆయనకు ఎవరు ఓటు వేస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కొత్త నాటంక..
తాను పార్టీని వీడుతున్నట్టు కేసీఆర్ నాటకం ఆడుతున్నారని, కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. అమిత్ షాతో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. అమిత్ షాను కలిసినప్పటి నుంచి కేసీఆర్‌కు నిద్ర పట్టట్లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు తనకు ఓటు వేస్తారనే ధీమాతో కేసీఆర్ ఉన్నారని, ఆయన చెప్పినట్లు చేయడానికి, ఓట్లు వేయడానికి ఓటర్లు చెంచాలా? అని ప్రశ్నించారు.

వాడుకుని వదిలేశాడు..
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ అందరినీ వాడుకుని వదిలేశాడని ధ్వమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరు కూడా ఇప్పుడు కేసీఆర్ వెంట లేరని, అందరూ దూరం పెట్టారని చెప్పారు. 1,400 మంది ఆత్మబలిదానంతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ మట్టిపాలు చేశాడని మండిపడ్డారు.

ఫామ్‌హౌస్ కోసం కొండపోచమ్మ ప్రాజెక్ట్..
కమీషన్ల కోసం కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. అది ఇప్పుడు నీళ్లల్లో మునిగిపోయిందని గుర్తు చేశారు. రీడిజైన్ చేస్తే ప్రాజెక్టు ఎలా మునుగుతుందని ప్రశ్నించారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ అవసరం లేకున్నా కట్టాడని, తన సొంత ఫామ్‌హౌస్ కోసమే దీన్ని నిర్మించారని ఆరోపించారు. ఏడేళ్లయినా తన నియోజకవర్గంలోని మునుగోడు రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications