స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై పోల్ పై కీలక నిర్ణయం..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల ద్వారా ప్రత్యర్థి పార్టీల పైన కాంగ్రెస్ పై చేయి సాధించామనే అభిప్రాయంతో ఉంది. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో తదుపరి కార్యాచరణ పైన కసరత్తు చేస్తోంది. పథకాల అమలు వేగం పెరగటంతో స్థానిక సంస్థల ఎన్నికల పైన కీలక నిర్ణయానికి సిద్దమైంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీటి పైన ఈ రోజు జరిగే పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ లెక్కల వేళ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ రోజు జరగనుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు సంస్థాగతంగా పార్టీ బలోపేతం వంటి అంశాల పైన చర్చించనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరు 30 లోపల నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంతకంటే ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాలని కూడా స్పష్టం చేసింది. రాష్ట్రంలో కుల గణన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటి వరకు సఫలం కాలేదు.

దీంతో, రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తి వేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. 4 నెలలు గడిచినా ఎలాంటి పురోగతి లేదు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం నిర్దేశించిన విధంగా వచ్చే నెల 30లోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ కారణాలతో బీసీలకు రిజర్వేషన్లు అమలు అధికారికంగా చేసే వెసులుబాటు లేకపోవడంతో ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న దానిపై చర్చించి.. ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications