మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం: ఢిల్లీ పర్యటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు
కడప: కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళుతున్నట్లు తెలిపారు. కుమారుడు రాజా రెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. వారి వెంట వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించుకున్నామని.. అందుకే తెలంగాణలో ఆ పార్టీకి మద్దతిచ్చామని తెలిపారు వైఎస్ షర్మిల. తమ మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి తాము పోటీ పెట్టకపోవడమే కారణమని తెలిపారు. తమ త్యాగాన్ని గుర్తించి కాంగ్రెస్ ఆహ్వానించిందని తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్లు షర్మిల తెలిపారు. రెడు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయన్నారు. తన కుమారుడి వివాహం సందర్భంగా వైయస్సార్ ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయ వచ్చినట్లు షర్మిల తెలిపారు. కాగా, జనవరి 4న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
మరోవైపు, తనతో కలిసి నడుస్తానన్న ఏపీ ఎమ్మెల్యే ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు షర్మిల. మరోవైపు షర్మిలకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఆమె ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు. పార్టీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications