ఖమ్మంలో కాంగ్రెస్ జోరు.. చేరికలతో కొత్తహుషారు: టీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ రెడ్డి విమర్శల హోరు
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ పార్టీలోకి ఖమ్మం జిల్లా నేతల చేరికలు కొనసాగుతున్నాయి. చేరికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త బూస్ట్ ఇస్తున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుఫాన్ రాబోతుందని ప్రకటించిన తర్వాత, క్షేత్ర స్థాయిలో చాలా మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఖమ్మంలో చేరికల పర్వం.. రేవంత్ రెడ్డి సమక్షంలో వెయ్యిమంది చేరికలు
తాజాగా ఖమ్మం మాజీ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్, మాజీ జెడ్పిటిసి భారతితో పాటు వారి ఆధ్వర్యంలో 1000 మంది టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారందరికీ కండువా కప్పి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నాలుగు రోజులుగా పార్టీలో వరుస చేరికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఖమ్మంలో 9 సీట్లు గెలిపిస్తే సన్నాసులు అమ్ముడుపోయారన్న రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి మళ్లీ తిరిగి పునర్ వైభవాన్ని సంతరించుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు 9 సీట్లు గెలిపిస్తే సన్నాసులు అమ్ముడు పోయారు అంటూ, కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ బాట పట్టిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. అంతేకాదు మోడీ, కెసిఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి మోడీ కెసిఆర్ పై యుద్ధం ప్రకటించాలని చెబుతూనే మోడీకి మద్దతుగా కెసిఆర్ నిలుస్తున్నారని, మోడీ కేసీఆర్ ఒకరికొకరు విలన్లుగా చిత్రీకరించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

కెసీఆర్ మీద మొదట తిరుగుబాటు చేసింది ఖమ్మం జిల్లా రైతులే
ఇక కేసీఆర్ మీద మొదట తిరుగుబాటు చేసింది ఖమ్మం జిల్లా రైతులేనని ఆయన పేర్కొన్నారు. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపింది కెసిఆర్ ప్రభుత్వం అని, అటువంటి కేసీఆర్ ను వచ్చే ఎన్నికలలో రైతులు తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గులాబీ తెగులుతో మిర్చి రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటే, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు కనీసం పరామర్శ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ పేరు పెట్టి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నా , మంత్రిపై కేసు పెట్టి ఆయనను పదవి నుంచి తొలగించాల్సింది పోయి, కెసిఆర్ ఆయనను పక్కనే పెట్టుకున్నాడు అంటూ మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో అన్ని సీట్లు తమవే.. రేవంత్ ధీమా
వచ్చే ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు తమవేనని ఖమ్మం ఖిల్లా పై మూడు రంగుల జెండా ఎగురుతుంది అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో ధోరణి పోర్టల్ తో ఊరినిండా పంచాయితీలే ఉన్నాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి, హైదరాబాదులో కూడా ధరణి పోర్టల్ వల్ల హత్యలు జరిగాయి అంటూ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని, రాష్ట్రంలో రైతు డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో కెసిఆర్ పాలన కు చరమగీతం పాడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.