నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ రైతు రచ్చబండ.. జయశంకర్ జిల్లాలో రచ్చబండలో రేవంత్ రెడ్డి!!
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో జోష్ నింపిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా, టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రెడీ చేసుకున్నారు.
చేరికల కోసం పోటీపడుతున్న తెలంగాణా రాజకీయ పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరివ్యూహం వారిదే!!

నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ..
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాహుల్ గాంధీ సభ నింపిన జోష్ కొనసాగేలా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న అన్ని గ్రామాలలోనూ కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నెలరోజులపాటు నిర్వహించాలని నిర్ణయించింది. రైతు రచ్చబండ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు హాజరై రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను రచ్చబండలో ఎండగడతారు.

జయశంకర్ జిల్లాలో రచ్చబండలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల పంచాయతీలలో జరగనున్న రచ్చబండ కార్యక్రమాలకు 400 మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు . ఇక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అక్కంపేట లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదురుకూరు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.నేడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించటం కోసం కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.

జిల్లాల వారిగా రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొననున్న కీలక నేతలు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి లో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, హుజూర్ నగర్ లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగిత్యాల మండలం పొలాస గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేకాదు కామారెడ్డి రూరల్ మండలం గూడెం గ్రామం లో పిఏసి కన్వీనర్ షబ్బీర్ అలీ, జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండల కేంద్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, కరీంనగర్ పరిధిలోని నగునూరు గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సంగారెడ్డి నియోజక వర్గం లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ఏ మాత్రం సక్సెస్ అవుతారో?
జనాల్లోకి రచ్చబండ కార్యక్రమం ద్వారా వెళ్తున్న కాంగ్రెస్ ప్రజల్లో రైతు డిక్లరేషన్ ను తీసుకువెళ్లటంలో ఏ మాత్రం సక్సెస్ అవుతారు అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతల్లో అన్ని జిల్లాలలోనూ అంతర్గత విబేధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ రచ్చ బండ కార్యక్రమాలు ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.