టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనం ఖాయం అంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు
కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ తలుపులు తెరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరే మిగులుతారు అంటూ షాకింగ్ కామెంట్ చేసిన ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లో విలీనమవటం ఖాయం అంటూ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు .

కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లో విలీనం అవటం పక్కా అంటున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు
కాంగ్రెస్ పార్టీ నుండి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి , పోడెం వీరయ్య, తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి పార్టీ మారతారని గులాబీ తీర్ధం తీసుకుంటారని వార్తలు వస్తున్న తరుణంలో రేగా కాంతారావు వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చాయి. కాంగ్రెస్ శాసనసభాపక్షం త్వరలోనే టీఆర్ఎస్ లో విలీనం అవుతుందని కాంగ్రెస్ నుండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు. విలీనం మాత్రం పక్కా అంటూ రేగా కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు.

టీఆర్ఎస్ నుండి స్థానిక సంస్థల ఎన్నికల బీ ఫామ్లు తీసుకున్న ఫిరాయింపు నేతలు
ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం పార్టీ ఫిరాయించిన చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, ఆత్రం సక్కులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన టీఆర్ ఎస్ బీఫామ్‌లు తీసుకున్నారు. టీఆర్‌ఎస్ఎల్పీలో పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీఫామ్‌లు తీసుకున్నామని రేగా కాంతారావు తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను టీఆర్‌ఎస్ పార్టీలో ఆకర్షితులయ్యేలా చేసిందని హరిప్రియా నాయక్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ విలీనం కావడానికి కొద్దిగా టైం పడుతుందన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు .

కాస్త టైమ్ పట్టినా విలీనం జరిగే తీరుతుందన్న ఫిరాయింపు నేత రేగా కాంతారావు
కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచింది. ఇందులో 10 మంది...సబితారెడ్డి, జాజుల సురేందర్, రేగ కాంతారావు, కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ, వనమా వెంకటేశ్వర్‌రావు, చిరుమర్తి లింగయ్య, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆత్రం సక్కు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు టీఆర్ఎస్ బాట పట్టారు . మరో ముగ్గురు చేరితే ఈ సంఖ్య కాంగ్రెస్ బలంలో మూడింట రెండొంతులవుతుంది. అప్పుడు వారు కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని శాసనసభాపతికి లేఖ రాస్తే ఆ ప్రక్రియ జరిగే వీలుంది. అందుకే మరో ముగ్గురు పార్టీ మారనున్నారని , కచ్చితంగా విలీనం ఖాయం అని రేగా బల్ల గుద్దిమరీ చెప్తున్నారు. మరి చూడాలి ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారో .












Click it and Unblock the Notifications