కాంగ్రెస్ ఖాతాలోకి మంథని మున్సిపాలిటీ: నెగ్గిన అవిశ్వాసం
పెద్దపల్లి: కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ వచ్చి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం నెగ్గడంతో ఆ పార్టీ కైవసమైన విషయం తెలిసిందే. తాజాగా, మంథనిలో కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 13 కౌన్సిలర్లలో9 మంది అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపారు.
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఆరేపల్లి కుమార్‌పై శుక్రవారం కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఫిబ్రవరి 1వ తేదీనే కౌన్సిలర్లు జిల్లా పాలనాధికారికి అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. మొత్తం 13 మంది కౌన్సిలర్లకు గానూ 9 మంది అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపారు.

మంథని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో హనుమానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులు ఎత్తారు. ఈ క్రమంలో మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అవిశ్వాసం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
సభ్యులు ఇచ్చిన అవిశ్వాసం నోటీసుకు 13 మందిలో 9 మంది కౌన్సిలర్లు మద్దతు పలకడంతో మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్‌లు పదవులు కోల్పోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. కాగా, అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు ఎత్తినవారిలో గుండ విజయలక్ష్మి, శ్రీపతి బానయ్య, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, వడ్లకొండ రవి, పెండ్రు రమ, వేముల లక్ష్మి, చొప్పకట్ల హనుమంతు, కొట్టె పద్మ ఉన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ శ్రీపతి బానయ్య మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాలుగా మంథనిలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. అనేక నిధులు వచ్చిన సమయంలో వినియోగించుకోకుండా ప్రజలను మోసం చేశారని, కనీసం కౌన్సిలర్లకు సరైన విలువ ఇవ్వకపోవడంతో విసుగు చెంది కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. మున్సిపల్ ఛైరపర్సన్, వైస్ ఛైర్మన్లపై తొమ్మిది మందిని అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించడం జరిగిందన్నారు.












Click it and Unblock the Notifications