తెలంగాణలో ఇక ఇంటింటికీ బూస్టర్ డోసు: మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు
హైదరాబాద్: ఓ వైపు సీజనల్ వ్యాధులు, మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో మంత్రుల సమీక్ష జరిగింది. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నిర్వహిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు.

ఇంటింటికీ బూస్టర్ డోసు: హరీశ్ రావు ఆదేశాలు
రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి కరోనా బూస్టర్ డోసు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశుభద్రతపై ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్‌లో మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఉండేలా చూసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని హరీశ్‌రావు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

సీజనల్ వ్యాధులతో అప్రమత్తమంటూ హరీశ్ రావు
ఇంటింటికీ వెళ్లాలని, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కూడా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హరీశ్ రావు సూచించారు.ప్రస్తుతం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా వ్యాధి ప్రబలుతుందని మంత్రి తెలిపారు. మలేరియా, డెంగ్యూ కేసులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం హెల్త్ టీమ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రజలందరూ తమ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వనికి సహకరించాలని కోరారు.

మంకీపాక్స్‌పై హరీశ్ రావు
దేశంలో ఇప్పుడిప్పుడే ప్రబలుతున్న మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం బాధితుడు ఫీవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, అతని నమూనాలను సేకరించి, పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.