కుటుంబ కలహాలతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య (ఫోటో)
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ జంట, అప్పుల బాధ భరించలేక మరో జంట ఆత్మహత్య చేసుకున్నాయి. ఈసీఐఎల్ డీఏఈ కాలనీలో నివసిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన దివాకర్ కుమార్ (29), హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన హిమానిదేవి(27)కి ఏడాది క్రితం వివాహం అయింది.
భార్యాభర్తలిద్దరూ ఎన్ఎఫ్‌సీలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరి కుటుంబాల మద్య గత కొద్ది రోజులుగా కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వారు నివసిస్తున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు.
సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధ భరించలేక మరో జంట ఆత్మహత్య
చౌదరిగూడ వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఉంటున్న దంపతులు అప్పుల బాధ భరిచంలేక ఆత్మహత్య చేసుకున్నారు. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన బెల్దే రాజేంద్రప్రసాద్ బతుకుదెరువు కోసం 12 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చాడు.
పంజాగుట్టలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. అప్పులు పెరిగి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో బోడుప్పల్‌లో ఉన్న ఇల్లు అమ్మేసి చౌదరిగూడ పంచాయితీ పరిధిలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో అద్దె ఇంట్లో ఉన్నాడు.

సోమవారం రాత్రి రాజేంద్రప్రసాద్ (47) అతడి భార్య అన్నపూర్ణ (38) ఓ గదిలో నిద్రించగా... కుమారుడు శరత్ చంద్ర, సాయి ఫణీంద్ర మరో బెడ్ రూమ్‌లో నిద్రించారు. మంగళవారం ఉదయం ఐదు గంటలకు తల్లిదండ్రులు నిద్ర లేకపోవడంతో కుమారులు తలుపులు తెరిచి చూడగా మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు.
వారు కేకులు వేయడంతో స్థానికులు వచ్చి 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా ట్యాబ్లెట్ల ఖాళీ కవర్లు కనిపించాయి. తాము అప్పులు చేశామని, తీరుద్దామంటే సమయం ఇవ్వకుండా అవమానించి హింసకు పాల్పడడంతో విధిలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డైరీలో రాశారు.
పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని రాజేంద్రప్రసాద్ డబ్బులు వసూలు చేశాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యభర్తలిద్దరూ మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications