షాకింగ్: తెలంగాణలో కరోనాకు 1.5లక్షల మంది బలి -కేసీఆర్ లెక్క అబద్ధం: కాంగ్రెస్ -కొత్తగా 869 కేసులు, 8మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ ఉధృతి తగ్గుతున్నది. వరుసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్య వెయ్యి లోపే నమోదైంది. మరణాలు కూడా తగ్గిపోయాయి. గురువారం నుంచి రాష్ట్రంలో ఓపెన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, కరోనా మరణాలకు సంబంధించి కేసీఆర్ సర్కారు చెబుతున్నవి తప్పుడు లెక్కలని, ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తున్నది..

కొత్తగా 869 కేసులు, 8మరణాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో 1,05,123 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 869 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,24,379కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 101, నల్గొండ జిల్లాలో 72, రంగారెడ్డి జిల్లాలో 65, సూర్యాపేట 54, ఖమ్మం 52, కరీంనగర్ 51 కేసులు వచ్చాయి.

భారీగా రికవరీ రేటు
నిన్న ఒక్కరోజే కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,669కి చేరింది. దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాల రేటు 1.3 శాతం కాగా, తెలంగాణలో అది 0.58శాతంగా ఉందని బులిటెన్ లో పేర్కొన్నారు. కరోనా బారి నుంచి నిన్న 1,197 మంది కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 6,07,658కి పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.93 శాతంకాగా, తెలంగాణలో అది 97.32 శాతంగా ఉంది.

ఓపెన్ వ్యాక్సినేషన్ షురూ
తెలంగాణలో ప్రస్తుతం 13,052 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ఓపెన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18 ఏళ్లు పైబడిన 1.5 కోట్లకు పైగా వ్యక్తులకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 జీసీవీసీ లను, అర్బన్ లోకల్ బాడీల్లో 204 జీసీవీసీలను, గ్రామీణ ప్రాంతాల్లోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అర్హత ఉన్నవారికి టీకాలు అందజేస్తున్నారు. ఇదిలా ఉంటే..

కరోనాపై కేసీఆర్ దొంగ లెక్కలు
తెలంగాణలో కొవిడ్‌తో కేవలం 3,669 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని.. కాంగ్రెస్ పార్టీ తీసిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు 1.50 లక్షల మంది మరణించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసిందన్నారు. జాతీయ విపత్తుల విభాగం ఎక్స్ గ్రేషియా ఇస్తే మన రాష్ట్రంలో 3,700 కుటుంబాలకు మాత్రమే న్యాయం జరుగుతుందన్నారు. మృతులందరి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందాలంటే ప్రభుత్వం అసలైన లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరణాలు దాచి రాష్ట్ర ప్రభుత్వం బాధితుల నోట్లో మట్టి కొడుతోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications