100కు కమిషనర్ ఫోన్ - సాధారణ పౌరుని తరహాలో : ఫిర్యాదు - వాట్ నెక్స్ట్..!!
హైదరాబాద్ కమిషనర్ సీవి ఆనంద్. సంథింగ్ స్పెషల్. నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలీసింగ్ లో తన మార్క్ చూపిస్తున్నారు. నగర కమిషనర్ గా ఎక్కడ సమస్య ఉన్నట్లుగా తనకు సమాచారం ఉంటే వెంటనే సిబ్బందిని ఆదేశించే అధికారం ఆయన చేతిలో ఉంది. కానీ, తన శాఖ సిబ్బంది పని తీరు తెలుసుకొనేందుకు ఆయన తాజాగా వ్యవహరించిన తీరు ఇప్పుడు సాధారణ పౌరుల్లోనూ ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.
రాత్రి 10.50 గంటల ప్రాంతంలో కమిషనర్ 100 కి డయల్ చేశారు. తన నివాసిత ప్రాంతం చుట్టుపక్కల రాత్రిపూట శబ్ద కాలుష్యం నెలకొందని చర్యలు, తగిన తీసుకోవాల్సిందిగా సాధారణ పౌరుని తరహాలో కోరారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న ప్లజెంట్ వ్యాలీలో నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ఉంటున్నారు. 100 కి కాల్ రావటం తో నైట్‌డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ చంద్రశేఖర్ అక్కడికి వెళ్లి పరిశీలించగా సమీపంలోని ఓం నగర్ బస్తీలో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తూ డప్పులు వాయిస్తున్నట్లుగా గుర్తించారు.

వెంటనే నిర్వాహకులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని 70బి కింద పెట్టీ కేసు నమోదు చేశారు. వెంటనే చర్యలు తీసుకున్నారు. అయితే, కమిషనర్ నేరుగా సంబంధిత అధికారులను ఆదేశించకుండా.. 100 కి డయల్ చేయటం.. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవటం ఇప్పుడు డిపార్ట్ మెంట్ లో ఆశ్చర్యానికి కారణమవుతోంది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాంతాల్లో సమర్ధవంతమైన అధికారిగా పని చేసిన సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసుల నుంచి హైదరాబాద్ సీపీగా వచ్చారు.












Click it and Unblock the Notifications