ఇక చాలు! మంచు విష్ణుకు తేల్చి చెప్పిన సీపీ
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదాల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుధవారం కుటుంబ వివాదంపై స్పందించిన నటుడు మంచు విష్ణు.. సాయంత్రం రాచకొండ కమిషనరేట్‌లో సీపీ సుధీర్ బాబును కలిశారు. రాత్రి వరకు కుటుంబ వివాదంపై విష్ణును సీపీ విచారించారు. మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ఈ సందర్భంగా విష్ణుకు సీపీ తేల్చిచెప్పారు.
మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. డిసెంబర్ 24 వరకు హైకోర్టు ఇచ్చిన మినహాయింపు గురించి సీపీ.. విష్ణుకు తెలిపారు. మోహన్ బాబు ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని విష్ణుకు సీపీ సూచించారు. అంతేగాక, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రూ. లక్ష జరిమానాతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విష్ణుకు సీపీ వార్నింగ్ ఇచ్చారు.

కాగా, మంచు విష్ణును వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని రాచకొండ సీపీ ఆదేశించిన నేపథ్యంలో మంచు విష్ణు కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లారు. నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో మంచు విష్ణును సుధీర్ బాబు విచారించారు.
మరోవైపు, బుధవారం ఉదయం మంచు మనోజ్‌ను సీపీ విచారించారు. ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలను శాంతిభద్రతల సమస్యగా మార్చకూడదని స్పష్టం చేశారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనోజ్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ఉంటానని మనోజ్ ఈ సందర్భంగా రూ. లక్ష బాండ్ ఇచ్చారు.
అంతకుముందు మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తి కోసమే మంచు మనోజ్ ఇదంతా చేస్తున్నారన్నారు. తన తండ్రి మోహన్ బాబు ఆస్తిపై ఆయనకే అధికారం ఉంటుందన్నారు. ఇంటికి రావద్దని చెప్పినా వస్తున్నాడని మంచు మనోజ్‌పై మండిపడ్డారు. మరోవైపు, జర్నలిస్టుపై మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదన్నారు. ఇంట్లోకి చొరబడి హంగామా చేయడంతోనే మోహన్ బాబు కోపంలో దాడి చేసుకుంటారన్నారు. అయితే, మోహన్ బాబు వారిపై దాడికి పాల్పడకుండా ఉండాల్సిందని అన్నారు.












Click it and Unblock the Notifications