ముప్పేట దాడితోనే తంటా: ఏకాకిని చేసే యత్నం.. రాజకీయ భవితవ్యంపై రేవంత్
మారిన పరిస్థితుల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీలోని ఒక వర్గం ప్రయత్నించడం ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్గీయులకు కంటగింపుగా పరిణమించింది. దీన
హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో కీలకనేతగా కొనసాగుతూ పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ వచ్చిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించడానికి కారణాలేమిటి? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందా? ఆయనను ఇబ్బందుల పాల్జేయడానికే ముప్పేట దాడి జరుగుతున్నదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్‌ను టీటీడీపీ నుంచి పంపేయడానికే ఇదంతా ఒక పథకం ప్రకారం సాగుతోందా? లేదంటే అధినాయకత్వం స్థాయిలోనే జరిగిన ఒక ఒప్పందం ప్రకారం తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయించడానికి ఆ పార్టీ నాయకత్వమే పథకం ప్రకారం నడుచుకుంటుందా? తెలంగాణ టీడీపీలో శరవేగంగా మారుతున్న ప్రస్తుత పరిణామాలు రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి.
రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి నేరుగా పంపలేక ఆయన వెనుక పొగబెట్టారన్న వాదన హాట్ టాపిక్‌గా మారింది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు ఒకవైపు తెలంగాణలో నేతలను వదులుకుంటూ మరోవైపు పార్టీని బలహీన పరుస్తున్నతీరు రేవంత్ రెడ్డికి ఏ మాత్రం మింగుడు పడటం లేదు. దీనికితోడు తెలంగాణలో కేసులతో సతమతమవుతుంటే ఏపీలోనూ వియ్యంకుడి వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నించడం కూడా రేవంత్ గళం విప్పడానికి కారణమయ్యాయని అంటున్నారు. ఈ పరిణామాలను బాగా విశ్లేషించుకున్నాకే కథ క్లైమాక్స్‌కు చేరుతున్నదని గమనించే రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేందుకు ఇలా టీడీపీ వ్యూహం
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆంధ్ర ప్రాంతంలో రేవంత్ రెడ్డి వియ్యంకుడి వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరిగాయని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వియ్యంకుడు, ఆయన బంధువుల సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. వారి కంపెనీల పీఎఫ్ ఖాతాలపైనా అధికారులు సోదాలు నిర్వహించి తనిఖీలు చేశారని అంటున్నారు. ఈ చర్య యాధృచ్చికంగా జరిగిందా? రాజకీయ ఒత్తిళ్లతో జరిగిందా? అన్నది తేలకున్నా, ఒక పథకం ప్రకారమే ఈ దాడులు జరిగాయన్న అభిప్రాయం రేవంత్ రెడ్డి వర్గీయుల్లో బలంగా నాటుకుపోయింది. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్న అంశాలు కూడా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే చోటు చేసుకున్నాయని సమాచారం.

తొలి నుంచి కేసీఆర్‌పై బాబు, రేవంత్ ఇలా దాడి
రాజకీయంగా రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుండటంతో మౌనం వీడక తప్పలేదన్న వాదన ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతోంది. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన టీటీడీపీ నేతల భేటీలోనూ ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించి నేతలను నిలదీసినట్టు తెలిసింది. అలాంటివేమైనా ఉంటే అధినేత చంద్రబాబుతోనే మాట్లాడాలే తప్ప బహిరంగ విమర్శలు ఎలా చేస్తావని సమావేశంలో ఒక నాయకుడు ప్రశ్నించారని సమాచారం. అంతే దీటుగా రేవంత్ రెడ్డి కూడా తాను అధినేత చంద్రబాబుతోనే తేల్చుకుంటానని స్పష్టం చేసినట్టు తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు. అంతకుముందు ఓటుకు నోటు కుంభకోణం బయట పడకముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ సీఎం చంద్రబాబు చాలా ఘాటుగా విమర్శలు చేసేవారు. పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

సచివాలయం ఖాళీకి యనమల సారథ్యంలో ఇలా కమిటీ
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాక చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు తగ్గించారు. రెండుమూడు సందర్భాల్లో పరస్పరం సమావేశమైనప్పుడూ వారి మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన షరతుల్లో భాగంగానే హైదరాబాద్‌పై పదేళ్ల హక్కునూ కాదనుకుని చంద్రబాబు తన నివాసాన్ని, సచివాలయాన్ని అమరావతికి మార్చారు. 2014 లో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితుల్లో పదేళ్ల పాటు హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన చేసుకోవచ్చని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించడానికి వీలుగా దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసి సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేయించుకున్నారు. కానీ ఓటుకు నోటు వ్యవహారం బయటకు పొక్కిన నేపథ్యంలో ఆ సౌకర్యాలను ఏమాత్రం ఉపయోగించుకోకుండానే చంద్రబాబు విజయవాడకు మకాం మార్చేశారు. ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సచివాలయంలోని కార్యాలయాలన్నీ ఖాళీ చేసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిన వెంటనే చంద్రబాబు స్పందించి వాటిని అప్పగించడానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు రంగం సిద్ధం
ఇక ఓటుకు నోటు కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పలుసార్లు అసెంబ్లీ నుంచి కూడా బహిష్కరించారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్న తరుణంలో టీడీపీ రాజకీయ పరిణామాలలో వేగంగా మార్పులు కనిపించాయి. టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తు వాదన తెర మీదకు తెచ్చారు. అది కూడా చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన సంకేతాలు అందిన తర్వాతే తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్ఎస్ విషయంలో తమ బాణీ మార్చారు. భవిష్యత్‌లో టీఆర్ఎస్‌తో పొత్తుకు మార్గం సుగమం చేయడానికి వీలుగా అన్నట్లు రాజకీయ కదలికలు మొదలయ్యాయి. ఆ క్రమంలో భాగంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో గానీ, బీజేపీతో గానీ పొత్తు ఉంటుందని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించి తేనెతుట్టెను కదిలించారు.

పొత్తుపై రేవంత్ వ్యతిరేకత ఇలా
అంతకు ముందు వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునే అంశంపై టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన కొందరు కీలక నేతల మధ్య సంప్రదింపులు జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలేమీ రుచించని రేవంత్ రెడ్డి తనదైన రీతిలో కేసీఆర్ పైన ప్రభుత్వంపైన విమర్శలను కొనసాగిస్తూనే వచ్చారు. టీఆర్ఎస్‌తో పొత్తేంటని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇంట్లోకి కూడా రానివ్వరని బహిరంగంగానే రేవంత్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ‘హస్తం' పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలొచ్చాయి. టీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో రేవంత్ నుంచి ఇలాంటి ప్రతిఘటన ఎదురుకావడం టీడీపీ అధి నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది.

టీఆర్ఎస్‌లో చేరిన నేతలే పొత్తులపై సంప్రదింపులా?
తెలంగాణలో టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నా పార్టీని బలోపేతం చేసే చర్యలేవీ ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టలేదన్న వాదన ఆ పార్టీ నేతల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమా? తెలంగాణ పార్టీని పూర్తిగా వదులుకోవడం అనే అంశాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు చర్యలు ప్రారంభమయ్యాయని పరిణామాలు గమనిస్తున్న రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లగానీ, కేసుల వంటి వ్యక్తిగత అంశాల వల్లగానీ చెప్తున్నారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వచ్చారు. తెలంగాణలో టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయమై ఆ తర్వాత కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించడం మానేశారు. ఓటుకు నోటుకు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మినహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. పార్టీ ఫిరాయించిన వారిపై తొలుత ఫిర్యాదులు చేస్తూ కొంత మాట్లాడినా ఆ తర్వాత వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. పైపెచ్చు అలా ఫిరాయించిన నేతలతోనే టీఆర్ఎస్, టీడీపీల మధ్య రాజకీయ పొత్తుల విషయం చర్చలు జరపడం గమనార్హం.












Click it and Unblock the Notifications