సీడబ్ల్యూసీ సమావేశాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే సీతక్క గుస్సాడి నృత్యం!!
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక సంఘం అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం పార్టీ సీనియర్ నాయకులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం అయ్యేందుకు విస్తృత ఏర్పాట్లు జరిగాయి.
పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పూర్వ అద్యక్షులు మొత్తం 84 మంది ఈ సమావేశంలో పాల్గొనున్నారు.తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న అతిథులకు ఆహ్వానం పలికేందుకు ప్రత్యేకంగా తాజ్ కృష్ణ హోటల్ వద్ద గుస్సాడి, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది.

ఉత్సాహంగా కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తుండగా ములుగు ఎమ్మెల్యే సీతక్క వారితో కలిసి నృత్యం చేశారు. ఆదివాసీల నృత్యం అయిన గుస్సాడి నృత్యం చేసి అక్కడున్నవారిలో ఎమ్మెల్యే సీతక్క జోష్ నింపి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేపు జరిగే విస్తృత స్థాయి వర్కింగ్ కమిటీ సమావేశానికి 140 మంది పైగా నాయకులు హాజరు కానున్నారు.
సమావేశానికి తెలంగాణ, రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జరుగుతున్న పార్టీ కీలక సమావేశంలో పార్టీ ఎన్నికల ప్రణాళికలు, ఇండియా కూటమి వ్యూహాలు, లోక్ సభ ఎన్నికల వ్యూహాలు వంటి పలు అంశాలపై ఈ సమావేశం చర్చించనుంది. కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సహా పలువురు నాయకులు ఇప్పటికే హైదరాబాద్ లో సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తాజ్ కృష్ణ వద్ద గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే సీతక్క#MLASeethakka #CWCMeetingHyd #CWCMeeting #CWCHyderabad #Congress #TelanganaCongress #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/DxKZHXu6IN
— oneindiatelugu (@oneindiatelugu) September 16, 2023
కాగా, రేపు సాయంత్రం తుక్కుగూడా లో జరిగే బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు వేణుగోపాల్ చెప్పారు. పార్టీ చేపట్టిన మూడు రోజుల కార్యక్రమాలు రాష్ట్ర రాజకీయ చిత్రాన్నే మార్చివేస్తుందని అన్నారు. ఇలా ఉండగా శాసనసభ నియోజక వర్గ స్థాయిలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కాంగ్రెసు సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా అగ్రశ్రేణి నాయకులు నగరానికి వస్తున్న నేపధ్యంలో సంబంధిత ప్రాంతాలలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications