ఖాళీ ప్యాకెట్లతో పాలను కల్తీ చేయడంలో దిట్ట: చివరకు అరెస్ట్ (ఫోటోలు)
హైదరాబాద్: పాలు కల్తీ చేస్తున్న వ్యాపారి ఇంటిపై సైబరాబాద్ మల్కాజగిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు ఆదివారం దాడి చేసి, పాల వ్యాపారిని అరెస్ట్ చేశారు. పాలను కల్తీ చేసి అమ్ముతున్నారని ఎస్‌వోటీ కానిస్టేబుల్ బ్రహ్మానికి సమాచారం వచ్చింది.

పోలీసులు వెంటనే స్పందించి నేరేడ్‌మెట్
సాయినగర్‌లోని పాల వ్యాపారి డి. అమృతలాల్ ఇంటిపై దాడి చేశారు. కల్తీ పాలను, దానికి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన అమృతలాల్ బతుకుదెరువు కోసం 20 ఏళ్ల కింద నగరానికి వలసవచ్చాడు.

చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం హెరిటేజ్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు. రోజుకు 300 నుంచి 500 లీటర్ల పాలుకొని ఆ పాలను ఒక పెద్ద టబ్‌లో పోసి వాటిలో 50 శాతం నీళ్లను కలుపుతున్నాడు.
టీ దుకాణాల నుంచి ఖాళీ బ్రాండెడ్ కంపెనీల పాల ప్యాకెట్లను సేకరించి వాటిలో నీళ్ల పాలను నింపి రీ ప్యాకింగ్ చేస్తున్నాడు. పాల ప్యాకెట్‌పై ఉన్న ధరను టిన్నర్‌తో చెరిపేస్తున్నాడు. బ్రాండెడ్ పాల ప్యాకెట్‌గా సాధారణ ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు.

ఎస్‌వోటీ అడిషన్ డీసీపీ ఆధ్వర్యంలో ఎస్‌వోటీ మాల్కాజగిరి జోన్ ఇన్‌స్పెక్టర్ ఎన్‌సీహీచ్ రంగసామి, ఎస్సై రాములు, కానిస్టేబుళ్లు బ్రహ్మాం, శ్రీనివాస్‌లు నిందితుడి ఇంటి నుంచి ఒక ప్యాకింగ్ మిషన్, 100 లీటర్ల పాలు, ఒక ప్లాస్టిక్ టబ్, ముడు టిన్నర్లు, 300 ఖాళీ బ్రాండెడ్ పాల కవర్లు, ఒక పాత్రను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 272, 293, 420 కింద కేసు నమోదు చేసి నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications