హైదరాబాద్ లో మోత మోగిస్తున్న 'మొంథా'.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
మొంథా తుపాను దూసుకొస్తోంది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపానుగా మారింది. గడిచిన 6 గంటలో 15 కి. మీ వేగంతో తుపాను కదులుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నంకు 60 కి. మీ దూరంలో కాకినాడకు 140 కి. మీ దూరంలో విశాఖపట్నంకు 240 కి. మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరందాటే సమయంలో గంటకు 90- 110 కి. మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భాగ్యనగరంలోని పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కుత్బుల్లా పూర్, గాజులరామారం, కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. రాబోయే గంట వ్యవధిలో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

మొంథా తుపాను నేపథ్యంలో తెలంగాణలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మిగిలిన 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తదుపరి ఈ రాత్రికి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications