సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురికి తీవ్రగాయాలు: ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్: బోనాల పండగ సందర్భంగా పిండి పంటలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు హుటాహుటిన వారిని మంటల నుంచి కాపాడి ఆస్పత్రులకు తరలించారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దోమలగూడలో నివాసం ఉంటున్న పద్మ బోనాల పండగ సందర్భంగా తన కూతురు, అల్లుడు, బంధువులను మూడు రోజుల క్రితం ఇంటికి పిలిచింది. మొత్తం ఇంట్లో ఏడుగురు ఉన్నారు. ఉదయం ఇంట్లో ఏడుగురు ఉన్నారు. ఉదయం పిండి పంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి.

గమనించిన స్థానికులు పద్మ కుటుంబసభ్యులను రక్షించే ప్రయత్నం చేశారు. మంటలను ఆర్పివేసి ఇంట్లో నుంచి వారందరినీ బయటికి తీసుకొచ్చారు. అప్పటికే ఆ కుటుంబంలోని వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు తెలసుకున్నారు.
ఆస్పత్రిలో ఏడుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతుండగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. ముగ్గురు చిన్నారులు అభినవ్(8), శరణ్య(6), విహార్(3)లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
బోనాల పండగను ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు వచ్చిన ఆ కుటుంబసభ్యులు ఇలా అనుకోని ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం ఇచ్చిన చాలా సేపటి తర్వాత అగ్ని మాపక సిబ్బంది వచ్చారని స్థానికులు అన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతానికి కూడా అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు తొందరగా రాకపోతే ఎలా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications