పండగ ఆఫర్ అంటే ఇదీ.. రూ. 150 కు మేక, కాటన్ బీర్లు.. ఎక్కడో తెలుసా..?
సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండగలకు భారీగా ఆఫర్స్ పెడుతుంటారు. ఒక్కో షాపు ఒక్కో విధంగా ఆఫర్స్ ప్రకటించి ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. చిన్న చిన్న వస్తువుల దగ్గర్నుంచి భారీ వస్తువుల వరకు అన్నింటిపై కొంత మేర ఆఫర్స్ ప్రకటిస్తుంటారు. అయితే కొనుగోలు దారులను ఆకర్షించేందుకు ఓ వ్యక్తి తన షాపులో క్రేజీ ఆఫర్ ప్రకటించాడు. దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ లో ఓ వ్యాపారి వినూత్నంగా ఆఫర్స్ ప్రకటించాడు.
పండగ సీజన్ లో ప్రతి షాపులో బిజినెస్ భారీగానే సాగుతుంది. తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రకటనలు ఇస్తుంటారు. అయితే త్వరలో దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ లో ఓ వ్యాపారి ఎవరూ ఊహించని విధంగా వినూత్నంగా ఆఫర్లు ప్రకటించాడు. సాయిని తిరుపతి అనే వ్యక్తి లక్కీ డ్రా పేరుతో బంపరాఫర్స్ ప్రకటించాడు.

కస్టమర్లు కేవలం రూ.150 చెల్లించి కూపన్ కొనుగోలు చేస్తే చాలు.. మొదటి బహుమతి మేక, రెండో బహుమతి ఒక కాటన్ బీర్లు(12 బీర్లు), మూడో బహుమతి ఫుల్ బాటిల్, నాలుగో బహుమతి కోడి, ఐదో బహుమతి చీర.. అంటూ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశాడు. దీంతో ఆ కూపన్ కొనేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. అక్టోబర్ 1న డ్రా తీస్తామని తిరుపతి తెలిపాడు. ఇదంతా కేవలం పండగ హంగామా ఎంజాయ్ చేసేందుకు గ్రామంలో సరదా కోసం మాత్రమే అని చెప్పుకొచ్చాడు. గతంలోనూ లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతి అందించినట్లు తెలిపాడు.
ఇక కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో కూడా ఇలాంటి ఆఫర్స్ కనువిందు చేస్తున్నాయి. రూ. 50రూపాయలు ఒక కూపన్ ఉంటే నాటుకోడి, మద్యం బాటిల్ గెలుచుకోవచ్చంటూ కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొదటి బహుమతి నాటు కోడి టీచర్స్ ఫుల్ బాటిల్, రెండో బహుమతి బ్లెండర్స్ ప్రైడ్, రిజర్వ్ ఫుల్ బాటిల్, మూడు బహుమతిగా రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ అంటూ ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications