సర్పంచ్ గా గెలిచిన చనిపోయిన అభ్యర్థి.. అధికారులు ఏం చేశారో తెలుసా..?
రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ఆర్ కాలనీ సర్పంచ్ గా ఇటీవల మరణించిన చర్ల మురళి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై సుమారు 300కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నామినేషన్ అనంతరం మురళి మృతి చెందిన నేపథ్యంలో గ్రామస్థులంతా ఆయనకే ఓటు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు తర్జనభర్జనలో ఉన్నారు.
వేములవాడ మండలంలోని చింతల్ ఠాణా గ్రామంలో విచిత్రమైన ఘటన జరిగింది. ఈ గ్రామంలో ఇటీవల మరణించిన వ్యక్తికి అధిక ఓట్లు వచ్చాయి. ఐదు రోజుల క్రితం గ్రామానికి చెందిన చర్ల మురళి(53) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడు నామినేషన్ తర్వాత మృతి చెందడంతో ఎన్నికల బరిలోనే ఉన్నాడు. చర్ల మురళి మృతి చెందడంతో అతనిపై అభిమానంతో గ్రామస్థులంతా అతనికే ఓటు వేశారు. దీంతో చర్ల మురళికి అధిక ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఫలితం ప్రకటించకుండా ఉన్నతాధికారి ఆదేశాల కోసం రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుచూస్తున్నారు.
మరోవైపు 95 ఏళ్ల వయసులో సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు గుంటకండ్ల రామచంద్రారెడ్డి. సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ గా ఆయన ఎన్నికయ్యారు. మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తండే రామచంద్రారెడ్డి. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్న ఎల్కచెర్ల గ్రామంలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చాయి. దీంతో రీ కౌంటింగ్ నిర్వహించారు అధికారులు. రీ కౌంటింగ్ లోనూ సమానమైన ఓట్లు రావడంతో టాస్ వేసి సర్పంచ్ ను నిర్ణయించారు.

ఇదిలాఉంటే వికారాబాద్ జిల్లా కొండగల్ మండలం ఖాజాహైమద్ పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక ఓ మహిళా అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక తెలంగాణలో తొలి దశలో మొత్తం 4, 236 పంచాయతీలకు ఇప్పటివరకూ 3332 సీట్లలో కౌంటింగ్ పూర్తయింది. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ 1840 పంచాయతీల్లో విజయం సాధించింది. అలాగే బీఆర్ఎస్ 930 పంచాయతీల్లో విక్టరీ కొట్టింది. బీజేపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 414 స్థానాల్లో గెలుపొందారు.












Click it and Unblock the Notifications