
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం; కేసీఆర్ పుట్టినరోజుపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మూడు రోజుల పుట్టినరోజు వేడుకలు కాకుండా 12 రోజుల వర్ధంతి వేడుకలను స్వయంగా నిర్వహించుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్ జన్మదిన వేడుకలపై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కెసిఆర్ దగ్గర డబ్బు బాగా ఉందని, మూడు రోజుల పుట్టినరోజు వేడుకలు మాత్రమే ఎందుకు చేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి మీరు మీ స్వంత 12-రోజుల చావు వేడుకలను నిర్వహించవచ్చు అని పేర్కొన్నారు. మీ మద్దతుదారులు 12వ రోజు మీకు నివాళులర్పిస్తారు. మీ మరణానంతరం వారు చేస్తారన్న గ్యారెంటీ లేదు అంటూ మూడు రోజుల ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలపై రేవంత్ రెడ్డి స్పందించారు.

టిఆర్ఎస్ ఐటి సెల్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో క్లిప్, రాజకీయ రచ్చకు కారణం అయింది. దీనిపై టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా కేసీఆర్ జన్మదిన వేడుకలు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పిసిసి రేవంత్ రెడ్డి కి టిఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో టిఆర్ఎస్ ఐటి సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ రెడ్డి ఫోటో తో పిండప్రదానం చేసి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి నిరసన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి తెలంగాణా వ్యతిరేకి, చంద్రబాబు పెంపుడు కుక్క
ఈ సందర్భంగా టిఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీష్ రెడ్డి రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, చంద్రబాబు పెంపుడు కుక్క అని నిప్పులు చెరిగారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పేదలకు సేవ కార్యక్రమాలు నిర్వహించాలని, మొక్కలు నాటే కార్యక్రమాలు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తే, చంద్రబాబు పెంపుడు కుక్క ఆయన రేవంత్ రెడ్డి దానిని రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. మా అధినేతకు 12 దినాలు చేయమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి పిండప్రదానం చేశామని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

రేవంత్ రెడ్డికి తెలంగాణా ప్రజలు బుద్ధి చెప్తారు
మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పుట్టుకను ప్రశ్నించిన బీజేపీని ఎదిరించిన గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ అని తేల్చి చెప్పారు. అటువంటి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. తొందరలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బానిస సంకెళ్ల నుంచి బయటపడి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పని చేయాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకుంటే తగిన ఫలితం అనుభవిస్తారని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.