ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, చిక్కోటి ప్రవీణ్ కేసుకు సంబంధం??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మూడురోజుల క్రితం సమావేశం నిర్వహించారు. అందులో ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల గురించి ప్రస్తావించారు. ప్రజాప్రతినిధులంతా ఈ దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే సంకేతాలను ఇచ్చారు. సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ భేటీలోను ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తూ ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు ఉపక్రమించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలు హైదరాబాద్ లో?
ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నట్లు సీబీఐ గుర్తించిందని, ఆ మేరకే ఈడీకి సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నగరంలోని గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు, అభిషేక్‌రావు, సృజన్‌రెడ్డి, అరుణ్‌రామచంద్రపిళ్లై ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వీరిలో ప్రేమ్‌సాగర్‌రావు, అభిషేక్ రావు, సృజన్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయనే అనుమానంతో ఆధారాలను సేకరిస్తున్నారు.

రాబిన్ డిస్టిలరీస్ పై ఈడీ సీరియస్
ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్టిలరీస్ వ్యవహారాన్ని ఈడీ సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించిన యాజమాన్యంతోపాటు బినామీ పెట్టుబడిదారులు ఎవరున్నారు? అనే కోణంలోను అధ్యయనం చేసింది. ఇటీవల ఈడీ అధికారులు క్యాసినో గ్యాంబ్లర్ చిక్కోటి ప్రవీణ్ కుమార్‌ను విచారించారు. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనీ లాండరింగ్‌కు పాల్పడే ప్రజాప్రతినిధుల జాబితాను సేకరించారు. వారిలో కొందరికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుత లిక్కర్ స్కాంలో ఉన్న ప్రజాప్రతినిధుల ప్రమేయం చిక్కోటి ప్రవీణ్ కేసులోను ఉందని అనుమానిస్తోంది. అందుకే సోదాలను ఉధృతంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

మనీష్ సిసోడియా బ్యాంక్ ఖాతాలు తనిఖీ
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇల్లు, బ్యాంకు ఖాతాలను సీబీఐ తనిఖీ చేసింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందించే వేగులు ఉన్నారని, అందుకే మూడురోజులు ముందుగానే ఆయన పార్టీవర్గాలను హెచ్చరించారంటున్నారు. ఈడీ ఏం చేస్తుందనేది ఇప్పుడు వేచిచూడాలి.












Click it and Unblock the Notifications