ఢిల్లీ లిక్కర్ స్కాం: కవితను ఏడున్నర గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి కవిత ఇంట్లోనే విచారణ చేపట్టారు. సుమారు ఏడున్నర గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు.. వివరాలు సేకరించారు.
సీఆర్పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా తెలిపిన ప్రకారం.. ఆదివారం ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు.
సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు.

కాగా, ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనే ఎక్కువ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆమెను సాక్షిగానే విచారించారు.
అయితే, ఇంతటి విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారిస్తారా? అనేదానిపై అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఇప్పటితో సీబీఐ విచారణ ముగిసిందని, కానీ, భవిష్యుత్తులో అవసరమైతే ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications