ధరణిపై రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?
Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ఒకటి- ధరణి పోర్టల్. రైతులు ఎదుర్కొంటోన్న భూసంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్ ఇది. దీనిపై సుదీర్ఘకాలంగా పెద్ద వివాదం నడుస్తూ వస్తోంది.
ధరణి పోర్టల్ వల్ల ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, భూములు ఉన్న రైతులు తమ పేర్లను ఇందులో రిజిస్టర్ చేయించుకోలేక పోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో సమయంలో ప్రకటించారు రేవంత్ రెడ్డి. ప్రజావాణిలో సైతం దీనికి ఫిర్యాదులు అందాయి.

ఈ క్రమంలో ధరణి పోర్టల్ పని తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌పై అందిన సమస్యలను క్రోడీకరించి వాటిని సత్వరంగా పరిష్కారించాలని రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
దీనికోసం అయిదుమంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వొకేట్ సునీల్, పదవీ విరమణ చేసిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బీ మధుసూదన్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ).. సభ్యులుగా ఉన్నారు.
శనివారం రంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీ సమావేశమైంది. అటవీ, వ్యవసాయం, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ధరణి పోర్టల్ నిర్వహణ, భూములపై ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది. అటవీ, వ్యవసాయం, పోడు భూములపై చర్చించారు.
ఈ కమిటీ ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి సమావేశం కానుంది. ఈ సారి రెవెన్యూ (దేవాదాయం), వక్ఫ్, సర్వే అండ్ సెటిల్మెంట్ విభాగాలకు చెందిన అధికారులు.. ఇందులో పాల్గొంటారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌లో పొందుపరిచిన భూముల వివరాలను కమిటీకి అందజేస్తారు.












Click it and Unblock the Notifications