తెరాసలో విభేదాలు: నేత నిర్బంధం, కుర్చీలు ధ్వంసం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో తెరాస నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 2001 నుండి పార్టీలో పని చేస్తున్న ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వకుండా, కొత్తగా చేరిన వారు తమను అణగదొక్కుతున్నారని పలువురు ఆందోళనకు దిగారు.
తెరాస పార్టీ జిల్లా తాజా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేంద్రను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్బంధించారు. ఈ సంఘటన శనివారం రాత్రి పార్టీ కార్యాలయంలో జరిగింది. రాజేంద్ర, మరో పార్టీ నాయకుడితో కలిసి కార్యాలయానికి వచ్చినట్టు తెలుసుకున్న ఆ పార్టీకి చెందిన దాదాపు 50మంది నాయకులు, కార్యకర్తలు అక్కడకు వచ్చారు.

తాము పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉద్యమాల్లో పాల్గొంటుంటే తమకు ప్రాధాన్యతనివ్వకుండా నూతనంగా పార్టీలో చేరినవారికి పదవులు అంటగడుతున్నారని ఆరోపించారు. విషయాన్ని తెలుసుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించిన గది నుంచి బయటకు తీసుకొనివచ్చారు.
ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర మాట్లాడుతూ.. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో కుర్చీలు, కిటికీలను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications