సింగిల్ ట్వీట్.. ట్విన్ గోల్స్: అదీ దిగ్గీ ట్వీట్స్ గుట్టు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగునాట నాడు ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ తొలుత నిర్ణయం తీసుకున్నదీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కాల క్రమంలో 2009లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా ఆ కొద్ది రోజులకే వైఎస్ హఠాన్మరణం పాలయ్యారు.

తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో సీఎం కే చంద్రశేఖర్‌రావు ఉద్యమ పార్టీ అధినేత నుంచి మామూలు రాజకీయ పార్టీ నేతగా మారి.. రాజకీయ లబ్ది కోసం 'బీసీ - ఇ' కేటగిరీలో ముస్లింల రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానంచేశారు.

అంతే కాదు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించాలని, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. జాతీయ స్థాయిలో ప్రధాన శక్తిగా బీజేపీ ఎదుగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం కీలక పరిణామం.

ఈ వారంలో తెలంగాణలో అమిత్ షా పర్యటన

ఈ వారంలో తెలంగాణలో అమిత్ షా పర్యటన

మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా ‘ఎంఐఎం'ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణపై పట్టు సాధించడమే లక్ష్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో.. ఈ వారంలో హైదరాబాద్‌లో తిష్ట వేయబోతున్నారు. తెలంగాణలో కొన్ని పార్లమెంట్ స్థానాలైనా తన కోటాలో కలిపేసుకోవాలని కమలనాథులు కదన వ్యూహం రచిస్తున్నారు. ఈ దశలోనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్.. తెలంగాణ పోలీసులు.. నకిలీ ఐఎస్ఐఎస్ వెబ్ సైట్ సృష్టించి ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి.

ఇలా హోంమంత్రి నాయిని హెచ్చరికలు

ఇలా హోంమంత్రి నాయిని హెచ్చరికలు

సహజంగానే దిగ్విజయ్ సింగ్ ట్వీట్లపై సీఎం కేసీఆర్ మినహా ఆయన కుమారుడు కేటీఆర్, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మొదలు బీజేపీ నేతల వరకు మండిపడ్డారు. రుజువులు చూపకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తాయని తేల్చి చెప్పారు. దిగ్విజయ్‌ చేసిన ఆరోపణల్లో నిజానిజాలేమిటి? అయోమయం సృష్టించడానికి ఇలాంటి ట్వీట్‌ చేశారా? అని వివిధ పార్టీల నేతలు అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ నేతలు కొందరు నేరుగా దిగ్విజయ్‌కే ఫోన్‌ చేసి ఆరా తీశారు. తమకు తెలిసిన పోలీసు ఉన్నతాధికారులను వాకబు చేశారు.

ముస్లింలను ఆకట్టుకునేందుకు డిగ్గీ పాట్లు

ముస్లింలను ఆకట్టుకునేందుకు డిగ్గీ పాట్లు

అధికార టీఆర్ఎస్ రిజర్వేషన్ల పెంపు పేరిట ముస్లింలకు దగ్గరవ్వాలని చూస్తుంటే.. పోలీసులు నకిలీ ఐఎస్ఎస్ వెబ్ సైట్ తో రెచ్చగొడ్తున్నారని దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్‌లో ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు' అన్నట్లు ఇటు రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్.. అటు కేంద్రంలోని బీజేపీ దూకుడును నిలువరించొచ్చన్న వ్యూహం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే అధికార టీఆర్ఎస్‌తోపాటు బీజేపీ నేతలు కూడా దిగ్విజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. ముస్లింలకు రిజర్వేషన్ల కల్పనతోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలని టీఆర్ఎస్.. ముస్లింలకు రిజర్వేషన్ అంశాన్ని వివాదాస్పదం చేసి ఇతర సామాజిక వర్గాలను తమవైపుకు తిప్పుకోవాలని బీజేపీ భావించాయి. ఈ రెండు పార్టీల వ్యూహాలకు ప్రతివ్యూహంగానే దిగ్విజయ్ సింగ్.. ఈ నకిలీ ఐఎస్ఎస్ వెబ్ సైట్ వివాదం ముందుకు తెచ్చి ఆ రెండు పార్టీలను ఒకింత ఆత్మరక్షణలో పడేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే తెలంగాణలో 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోరు త్రిముఖ పోరుగా సాగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

బాధ్యతారాహిత్య వ్యాఖ్యలన్న టీఆర్ఎస్

బాధ్యతారాహిత్య వ్యాఖ్యలన్న టీఆర్ఎస్

అందువల్లే దిగ్విజయ్‌ ట్వీట్‌లో నిజానిజాలు పక్కన పెడితే ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని రాజకీయ పార్టీలు ఆచితూచీ వ్యవహరిస్తున్నాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేయగా.. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారని అధికార టీఆర్‌ఎస్‌ మండిపడింది. ఇక దిగ్విజయ్‌ ట్వీట్‌ వెనుక వ్యూహమేంటో తెలియక రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలెవరూ మీడియా ముందుకు కూడా రాలేదు.

అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీకి డిగ్గీరాజా హెచ్చరిక

అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీకి డిగ్గీరాజా హెచ్చరిక

దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్‌ వెనుక వాస్తవాలు తెలుసుకునేందుకు టీపీసీసీ ముఖ్య నేత ఒకరు డిగ్గీ రాజాతో ఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. తాను చేసిన ట్వీట్‌ ఆషామాషీ వ్యవహారం కాదన్నారే తప్ప దాని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఐఎఐఎస్‌ పేరిట ప్రారంభించిన నకిలీ వెబ్‌సైట్‌నకు సంబంధించి అసలు కథ మున్ముందు ఉంటుందని, జరగబోయే పరిణామాలను జాగ్రత్తగా గమనించాలని దిగ్విజయ్‌ ఆ నేతకు సూచించారు. మరికొందరు నేతలు మాట్లాడినా.. ఆయన దీనిపై పూర్తి వివరాలు తెలియజేయడానికి నిరాకరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలని సూచించినట్లు చెబుతున్నారు. ఐఎస్ఐఎస్‌ పేరిట పోలీసులు వెబ్‌సైట్‌ నడుపుతున్నారా? లేదా? అన్నది పక్కన పెడితే ముస్లింల దరి చేరేందుకు కాంగ్రెస్ పార్టీకి చేయూతనిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అధికార టీఆర్‌ఎస్‌ ముస్లింలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఈ నేపథ్యంలో పోలీసులు ఇలా అమాయక ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారన్నది ప్రచారంలో పెడితే కాంగ్రెస్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు. కొన్నిసార్లు ఇది బెడిసి కొట్టే ప్రమాదం కూడా లేకపోలేదని ఆ నేత వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో మళ్లీ గెలుపు అనుమానమే

కర్ణాటకలో మళ్లీ గెలుపు అనుమానమే

ఇటీవల దక్షిణాదిన కర్ణాటక, ఏపీ, తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కాంగ్రెస్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీతో సర్వే చేయించుకున్నది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవని, ఏపీలో పరిస్థితి గత ఎన్నికలతో పోలిస్తే దిగజారిందని ఆ సర్వేలో తేలింది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తో పోలిస్తే ఓట్ల పరంగా భారీ తేడా కనిపించినా రెండోస్థానంలో 36 శాతం ఓట్లు కలిగి ఉన్నట్లు ఆ సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 52 శాతం ఓట్లు లభిస్తాయని ఆ సర్వే వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో గమ్మత్తేమిటంటే ముస్లింలు కేవలం 2 శాతం మాత్రమే కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. ఎన్నికలకు ఏడాదిన్నర వ్యవధి మిగిలిన ఉన్న తరుణంలో ముస్లిం వర్గాలను టీఆర్‌ఎస్‌కు దూరం చేసేందుకు దిగ్విజయ్‌ ఈ పాచిక వేసి ఉంటారని కాంగ్రెస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దిగ్విజయ్‌ ఆరోపించినట్లు పోలీసులు ఐసిస్‌ పేరిట ఓ వెబ్‌సైట్‌ పెట్టి ముస్లిం యువతను రెచ్చగొట్టినా వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వదిలేస్తున్నారని, ఒక విధంగా అది మంచిదేనని, వారు పక్కదారులు పట్టకుండా ఉంటుందని కాంగ్రెస్‌ నేతలే ప్రైవేట్‌ సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

ట్వీట్‌ వెనుక పోలీస్‌ కోల్డ్‌వార్‌

ట్వీట్‌ వెనుక పోలీస్‌ కోల్డ్‌వార్‌

దిగ్విజయ్‌ ట్వీట్‌ వెనుక పోలీస్‌ కోల్డ్‌వార్‌ ఉందా? అంటే అవుననే నిఘా వర్గాలు అంటున్నాయి! గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఉగ్ర నెట్‌వర్క్‌ ఉన్నా, దాన్ని ట్రాక్‌ చేయడం, పేలుళ్ల పథక రచనను నిరోధించి బ్రేక్‌ చేయడం కేవలం తెలంగాణ పోలీస్‌కు మాత్రమే సాధ్యమైంది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అనేక మంది కీలక ఉగ్ర వాదులను తెలంగాణ పోలీస్‌ విభాగం పట్టించింది. అక్కడి స్థానిక నిఘా బృందాలకు, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌కు సైతం దొరకని ఉగ్రవాదులని తెలంగాణ పోలీసులు పక్కాగా ఆపరేషన్‌ నిర్వహించి అరెస్టులు నిర్వహించారు. పలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ తెలంగాణ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. అయితే తమ రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసులు ఇలా దూకుడుగా వ్యవహరించడం ఆయా రాష్ట్రాలకు రుచించలేదు. దీంతో ఆ రాష్ట్రాల పోలీసులకు, తెలంగాణ పోలీసులకు మధ్య కోల్డ్‌వార్‌ మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని పోలీస్‌ అధికారులు.. ఈ విషయాన్ని దిగ్విజయ్‌సింగ్‌ దృష్టికి తెచ్చినందునే ఆయన ట్వీట్ల వర్షం కురిపిస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

నెట్ వర్క్ నిర్వహణ అసాధ్యమంటున్న పోలీసుశాఖ

నెట్ వర్క్ నిర్వహణ అసాధ్యమంటున్న పోలీసుశాఖ

డిగ్గీరాజా ఆరోపిస్తున్నట్టు నకిలీ వెబ్‌సైట్‌ ఉంటే చూపాలని, పక్కా ఆధారాలతో రావాలని రాష్ట్ర పోలీస్‌ విభాగం సవాల్‌ విసిరింది. అవాస్తవాలతో తమ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం సరి కాదని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల్లో తమ బృందాలు ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదిస్తూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నది. ఇతర రాష్ట్ర పోలీసుల్లో ఉన్న అసహనం దిగ్విజయ్‌ ట్వీట్ల ద్వారా బయటపడిందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ, ఎన్‌ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్‌.. విభాగాలు కూడా ఈ అంశంపై ఆరా తీశాయని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి నెట్‌వర్క్‌ కొనసాగించడం అంత సులభం కాదని, తాము చేసే ఆపరేషన్స్‌ను ఎన్‌ఐఏ, కేంద్ర హోంశాఖ, కేంద్ర ఇంటెలిజెన్స్‌ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయని, ఆ విభాగాలను కాదని తాము ముందుకెళ్లే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టంచేశారు.

డిగ్గీరాజా, జైరాం వల్లే 2014 కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరలేదు

డిగ్గీరాజా, జైరాం వల్లే 2014 కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరలేదు

తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్‌ బహిరంగ క్షమా పణ చెప్పాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. అట్టర్‌ ప్లాఫ్‌ పార్టీకి ఇన్‌ చార్జిగా ఉన్న దిగ్విజయ్‌.. రాష్ట్ర పోలీస్‌లకు క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్‌ తమతో పొత్తుకు యత్నించిందని, దిగ్విజయ్‌ సింగ్, జైరాం రమేశ్‌ వల్లే తాము పొత్తుకు నిరాకరించామని పేర్కొన్నారు. తెలం గాణ పోలీసులు దేశంలోనే సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior Congress leader digvijay singh strategically dragged TRS on muslim reservations.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి