మా విడాకులకు రండి: ఆహ్వాన పత్రికలు పంచిన భర్త, ఐదుగురి అరెస్ట్
వరంగల్: వివాహ ఆహ్వాన పత్రికలు పంచడం సర్వసాధారణమే. అయితే ఇక్కడ మాత్రం విడాకుల ఆహ్వానం పత్రికలు పంచడం చర్చనీయాంశంగా మారింది. తెలుగులో వచ్చిన ఓ సినిమాను తలపించేలా భార్యతో గొడవపడిన ఓ ప్రబుద్ధుడు విడాకులు తీసుకుంటున్నాం రండి అంటూ ఆహ్వాన పత్రికలు పంచాడు.
వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణగిరికి చెందిన ముత్తోజు వెంకట్రాజం, రాజమణి దంపతుల కుమార్తె ఉమకు నాలుగున్నర సంవత్సరాల క్రితం దుగ్గొండికి చెందిన కలకొండ సురేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ పాప.

మూడు రోజుల క్రితం భార్యతో గొడవపడిన సురేష్ ఆమెను పుట్టింటికి పంపించాడు.బావమరిది రమేష్‌తోనూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం సురేష్ మరో ఐదుగురితో కలిసి నారాయణగిరికి వచ్చి ఫిబ్రవరి 14న జరిగే 'విడాకుల పంచాయితీకి ఆహ్వానం' అని ముద్రించిన కరపత్రాలు ఇంటింటికీ పంపిణీ చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారిని పట్టుకోగా, సురేష్ తప్పించుకున్నాడు.
మిగితా ఐదుగురిని ఆరా తీయగా తమకు చదువురాదని, రూ. 300 కూలి ఇస్తామంటే వచ్చి కరపత్రాలు పంచుతున్నామని తెలిపారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. దీనిపై సీఐ రాజయ్యను వివరణ కోరగా ఉమ భర్తకు ఫోన్ చేసి రమ్మని చెప్పామని, అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications