వరి పంట వేయొద్దు: తేల్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఇతర పంటలే లాభమన్న హరీశ్ రావు
హైదరాబాద్: వరి పండించే రైతులకు షాకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యాసంగి(వేసవి)లో వరి పంట వేయొద్దని మరోసారి తేల్చి చెప్పింది. యాసంగి పంటను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పస్టం చేసింది. వానకాలం పంటను మాత్రమే కొనుగోలు చేస్తుందని తెలిపింది. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
రైతుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత మరెవరికీ లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగిలో వరిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదని, వానాకాలం వరి పంటను మాత్రమే కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. యాసంగిలో తేమ కారణంగా బియ్యం కొనబోమని కేంద్రం చెప్పిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్రానిదేనని, కానీ, కొనడం లేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు.

భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ యాసంగిలో రైతులు వరి వేయకుండా ఇతర పంటలను వేసుకోవాలని సూచించారు. సీడ్ కంపెనీలతో ఒప్పందమున్న రైతులు, మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు వరి వేసుకోవచ్చన్నారు. వానాకాలంలో పండే వరి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు.
సాగు రంగాన్ని సీఎం కేసీఆర్ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారని చెప్పారు. ఎరువుల కొరతలేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి వేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి వరి కొనుగోలు జరిగేలా చూడాలన్నారు.
మరోవైపు, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా వరి పంట కొనుగోలు విషయంపై స్పందించారు. మారుతున్న పరిస్థితులు, మార్కెట్‌కు అనుగుణంగా రైతులు మారాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చిన్నకోడూరు మండలంలోని శనివారం రైతు వేదికను ప్రారంభించిన అనంతరం.. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రోత్సాహం, భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మాచాపూర్, చౌడారం గ్రామాల్లో సభ్యత్వం పొందిన 750 మంది రైతులకు పొద్దుతిరుగుడు విత్తనాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
రైతులు సంఘటితంగా మారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలను గడించవచ్చన్నారు మంత్రి హరీశ్ రావు. రైతు ఉత్పిత్తిదారుల సంస్థ- ఎఫ్‌పీఓ కార్యక్రమాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని, రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే ఎఫ్‌పీఓ ఉద్దేశమన్నారు. పంట మార్పిడి విధానంలో భాగంగా చిన్నకోడూరు మండలంలో వెయ్యి ఎకరాలకు పొద్దుతిరుగుడు విత్తనాన్ని మారుస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతులకు నేరుగా మద్దతు ధర రావడంతో పాటు వచ్చిన ఉత్పత్తి ఆదాయాన్ని తిరిగి ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. పొద్దు తిరుగుడు పువ్వు తేనేటీగల ఉత్పత్తి ద్వారా కలిగే లాభాలపై 700 మంది రైతులకు విడతల వారీగా రైతు వేదికలో రోజూ శిక్షణ ఇవ్వాలని సంస్థ శాస్త్రవేత్తలు, ప్రతినిధులను మంత్రి కోరారు. యాసంగిలో సన్ ఫ్లవర్ పంటకు మంచి దిగుబడి వస్తుందని, ఈ విషయంపై శాస్త్రవేత్తలు రైతులను చైతన్యం చేయాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యామ్నాయ పంటల సాగులో పని తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుందన్నారు మంత్రి. రాష్ట్రం మరింత సమృద్ధి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నూనె గింజల ఉత్పత్తిలో భారత్ రూ.90వేలకోట్ల విదేశీ మాదక ద్రవ్యం కోల్పోతున్నట్లు, పామాయిల్ సాగు లాభసాటిగా ఉందని, ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. ఏటా దేశంలో రూ.90వేల కోట్ల విలువైన పామాయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీని నియంత్రణకు దేశంలో 70లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలని, ఈ సమయంలో ఆయిల్ సీడ్ మనకు ఓ వరంలాంటిదన్నారు. వచ్చే ఏడాది 50వేల ఎకరాల ఆయిల్ పామ్ నర్సరీకి చిన్నకోడూరు, సిద్ధిపేట సిద్ధమైందని మంత్రి చెప్పారు. నూనె ఉత్పత్తులు, పప్పు దినుసుల పంటలు పండించాలని రైతులను కోరుతూ.. చిన్నకోడూర్ మండలంలో ఎఫ్‌పీఓ వెయ్యి ఎకరాలకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం ఓ వరమన్నారు.
కేంద్ర ప్రభుత్వం వరి కొనమని లేఖ రాసిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మూడుసార్లు ఢిల్లీ వెళ్లి ధాన్యం కొనుగోలు విషయమై చర్చించి వచ్చారని.. అయినా మార్పు రాలేదని తెలిపారు. ఎఫ్‌ఐసీ నాలుగేళ్లకు సరిపడే ధాన్యం నిండిందని.. ఈ యాసంగికి వరి కొనమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, ఎఫ్‌సీఐ ఉంపుడు బియ్యం కొనే పరిస్థితి లేదని, ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉందన్నారు. ఈ సారి సిద్ధిపేట జిల్లాల్లో ధాన్యం రికార్డు స్థాయిలో 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని.. గతంలో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం పండేదని తెలిపారు. తెలంగాణలో పండిన పంట మొత్తం కొనడానికి కొనుగోలు సిద్ధంగా ఉన్నాయని.. కానీ పండిన పంట ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు సమస్యగా మారిందన్నారు.












Click it and Unblock the Notifications