పసికందులతో వ్యాపారం: డాక్టర్ అరెస్టు, గుట్టు ఇలా రట్టు....
పసికందులతో వ్యాపారం ఏమిటని అనుకుంటున్నారా? మీరు కరెక్టుగానే చదివారు. వైద్య విద్య వెలగబెట్టిన అతగాడికి డబ్బు సంపాదించేందుకు ఇంతకు మించిన మార్గం కనిపించనట్టుంది.
ఖమ్మం: పసికందులతో వ్యాపారం ఏమిటని అనుకుంటున్నారా? మీరు కరెక్టుగానే చదివారు. వైద్య విద్య వెలగబెట్టిన అతగాడికి డబ్బు సంపాదించేందుకు ఇంతకు మించిన మార్గం కనిపించనట్టుంది. అంతేకాదు, గర్భిణులకు చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేయడం కూడా ఇతగాడి మరో వ్యాపారం. కొన్నేళ్ల నుంచి ఇతగాడి ఈ వ్యాపార దందా సాగుతోంది. ఈ పాపాల చిట్టా నిండిపోయింది. పోలీసులకు దొరికిపోయాడు.

ఎవడు..? ఎక్కడ..? ఎలా..?
అతడి పేరు శ్రీనివాస్. చదివింది బీఏెఎంఎస్. మహబూబాబాద్ జిల్లాలోని కురవిలో శ్వేత నర్సింగ్ హోం పేరుతో ఆస్పత్రిని ఎన్నో ఏళ్ల కిందట స్థాపించాడు. తన చట్ట విరుద్ధ ‘వ్యాపారానికి' దీనిని అడ్డాగా మార్చుకున్నాడు. సంతాన లేమితో బాధపడుతున్న వారికి, కడు పేదరికంతో భారంగా బతుకీడుస్తున్న వారికి ‘కౌన్సెలింగ్' ఇస్తుంటాడు. పిల్లలు లేరని బాధపడేకన్నా ఎవరో ఒకరిని పెంచుకుంటే మంచిదని సలహా ఇస్తాడు, ఒప్పిస్తాడు.
నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని తమ పసికందులను దత్తత (వ్యాపార పరిభాషలో చెప్పాలంటే ‘అమ్మకం') ఇస్తే పెంపకం భారం తగ్గుతుందని, ఎంతోకొంత డబ్బు కూడా చేతికందుతుందని ఆశ పెడతాడు. ఇలా ఇద్దరికీ ‘డీల్' కుదురుస్తాడు. ఇప్పటివరకు ఇలా ఏడుగురు పసికందులను విక్రయించాడని, తెలంగాణతోపాటు ఏపీకి కూడా ఇతగాడి ‘వ్యాపారం' విస్తరించిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇతగాడి ఆస్పత్రి నుంచి కొన్ని రికార్డులను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. వాటిలో మరిన్ని ‘వ్యాపార' లావాదేవీల వివరాలు ఉన్నాయని సమాచారం.

ఎడాపెడా అబార్షన్లు
ఇతగాడికి మరో వ్యాపారం కూడా ఉంది. ఏమాత్రం వైద్యార్హతలు (అబార్షన్లు చేసేందుకు) లేని ఇతగాడు చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేయడంలో సిద్ధహస్తుడు. ఇతర ఆస్పత్రుల్లో అబార్షన్ చేయించుకోవడం సాధ్యపడదనుకున్న వారంతా ఇతగాడిని ఆశ్రయిస్తుంటారు. ఇది ఇటీవలి కాలంలో వైద్యారోగ్య శాఖాధికారుల ద్రుష్టికి వెళ్లింది. వారు కన్నెర్ర చేశారు. ఇతగాడి ఆస్పత్రిని సీజ్ చేశారు.

ఇలా.. గుట్టురట్టు
ఇతగాడు, ఎన్నో ఏళ్లుగా గుట్టుగా సాగిస్తున్న పసికందుల విక్రయ వ్యాపారం ఎలా రట్టయిందంటే... ఖమ్మంలోని జయనగర్ కాలనీకి చెందిన దంపతులు గుంటూరు భానుప్రసాద్, రాణి దంపతులకు సంతానం లేదు. భానుప్రసాద్, తనకు పరిచయమున్న కురవిలోని డాక్టర్ శ్రీనివాస్ ను సంప్రదించాడు. కురవి మండలంలోని నేరేడు తండాకు చెందిన ఓ తల్లి నుంచి పసికందును ఇప్పించాడు.
బదులుగా, ఆ తల్లికి భానుప్రసాద్ దంపతులు 50వేల రూపాయలు ఇచ్చారు. పసికందును తీసుకుని ఆ దంపతులు ఖమ్మంలోని తమ ఇంటికి చేరుకున్నారు. ఆ పసికందును ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న చర్చ చుట్టుపక్కల వారిలో మొదలైంది. ఇది ఈనోటా.. ఆనోటా నాని, చివరికి పోలీసులకు చేరింది. ఖమ్మం అర్బన్ సీఐ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఎస్ఐ రాము దర్యాప్తు చేపట్టారు. పసికందుల అమ్మకందారుడిగా, అబార్షన్ల డాక్టర్ గా పేరుబడిన శ్రీనివాసును అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సాగిస్తున్నారు. భానుప్రసాద్ దంపతుల నుంచి పసికందును ఐసీడీఎస్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు.












Click it and Unblock the Notifications